స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో 370 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. చంద్రబాబు నాయుడు అరెస్టు చేసి జైల్లో పెట్టగలిగింది సిఐడి. ఈ కేసులో ఆయన నేరం చేసినట్లుగా నిరూపించి శిక్ష పడేలా చేయాలన్నది వారి లక్ష్యం. చంద్రబాబు నేరానికి పాల్పడ్డారని ఆధారాలన్నీ తమ వద్ద పుష్కలంగా ఉన్నాయని అంటూ ఉన్న సిఐడి.. వాటిని కోర్టు ఎదుట మాత్రం పెట్టలేదు. బహుశా చంద్రబాబును కూడా విచారించిన తర్వాత, ఆయన మాటలతో తమ ఆధారాలను సమన్వయపరిచి కోర్టుకు నివేదించాలని వారి ఉద్దేశం కావచ్చు.
కానీ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో జరిగిన నేరాలుగా, ఘోరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ అంశాల గురించి అయితే మాట్లాడుతున్నారో.. అలాంటి వాటిలో ఒక కీలక విషయం గురించి.. చంద్రబాబు నాయుడు, కస్టడీ విచారణలో చెప్పిన సమాధానాలలో భాగంగా, వైయస్ రాజశేఖర్ రెడ్డి తో ముడిపెట్టి సమాధానం చెప్పడం ఇప్పుడు కీలక విషయంగా కనిపిస్తోంది. గంటా సుబ్బారావు అనే వ్యక్తిని అడ్డదారిలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థలోకి తీసుకువచ్చారని, కీలక బాధ్యతలో నియమించారని, ఇది చంద్రబాబు నిర్ణయం మేరకే జరిగిందని వైసీపీ నాయకులు పదేపదే ఆరోపణలు గుప్పించారు. అడ్డగోలుగా విమర్శించారు. గంటా సుబ్బారావు ద్వారానే సకల అవినీతికి పాల్పడినట్లుగా వారు ఆరోపణలు చేశారు. అదే విషయాన్ని సిఐడి కూడా తమ విచారణలో భాగంగా ప్రశ్నించినట్లు వార్తలు వస్తున్నాయి. గంటా సుబ్బారావును కీలక బాధ్యతలో ఎందుకు నియమించారు? అనే ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు చాలా స్పష్టతతో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ సాఫ్ట్వేర్ నిపుణుల్లో ఘంటా సుబ్బారావు ఒకరిని.. వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఆయనకు మూడు కీలక పదవులు ఇచ్చారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
గంటా సుబ్బారావు అనగానే.. చంద్రబాబు నాయుడుకి అనుచరుడిలాగా, ఆయన దోపిడీకి సహకరించే వ్యక్తి లాగా ఇన్నాళ్లపాటు వైసీపీ నాయకులు మాటలు విసురుతూ వచ్చారు. ఇప్పుడు సిఐడి కి చంద్రబాబు చెప్పిన సమాధానం లో, ఆన్ రికార్డ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదే ఘంటా సుబ్బారావుకి మూడు కీలక పదవులు ఇచ్చారనే ప్రస్తావన కీలకంగా గమనించాలి. చంద్రబాబు సమాధానంతో వైసీపీ నాయకులకు నోటా మాట రాని పరిస్థితి. ఎవరి ద్వారా అయితే చంద్రబాబు నాయుడు అవినీతికి ముడి పెట్టాలని అనుకున్నారో, అదే గంటా సుబ్బారావుకు , వైయస్ రాజశేఖర్ రెడ్డి తో అంతకు మించిన అనుబంధం ఉన్నదనే వాస్తవం వారికి షాక్‌గా మారింది. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు మీద ఎలా బురద చల్లాలా అని వారు తలలు పట్టుకుంటున్నారు.