తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంత వైభవంగా ఏమీ లేదు. ఏకపక్షంగా పోటీచేసి సీట్లు గెలిచే సత్తా లేదు. పార్టీ పట్ల అభిమానం ప్రజల్లో ఉన్నదనేది వాస్తవం.. కానీ.. నాయకులు చాలా మంది ఫిరాయించడం వలన.. పార్టీ తిరిగి వైభవ స్థితికి చేరడానికి టైం పట్టే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పోటీచేయకుండా ఊరుకుంటే.. తర్వాత నిలదొక్కుకోవచ్చుననే ఆలోచనకు పార్టీ అధినేత వచ్చారు. కేసీఆర్ సర్కారు గద్దె దిగడం ఒక్కటే లక్ష్యం కాబట్టి.. ఏపీలో మిత్రపక్షం జనసేన కూడా బరిలో ఉంటున్న నేపథ్యంలో పోటీవద్దని చెప్పేశారు. అయితే కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం.. పోటీచేయకపోతే అసలు పార్టీ ఎందుకు అని అలిగి అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. రెండే రోజుల వ్యవధిలో కాసాని గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కాసాని వంటి నేత ఇంకొకరు లేరని కేసీఆర్ కీర్తించారు కూడా.
కాసాని జ్ఞానేశ్వర్ , కేసీఆర్ కోవర్టు గానే.. టీడీపీకి సారథ్యం వహించారని.. మొత్తం 119 స్థానాల్లో పార్టీని పోటీకి దింపడం ద్వారా.. కేసీఆర్ నోట్లో పాలుపోయదలచుకున్నారని.. చంద్రబాబు ఆలోచనతో తాను మాట్లాడుకున్న డీల్ చెడిపోవడంతో.. ఆయన రాజీనామా చేసి భారాసలోకి వెళ్లారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అతీగతీ లేకుండా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ను చంద్రబాబు తీసుకువచ్చి తెలంగాణ పార్టీ సారథ్యం అప్పగించారు. ఆయన దూకుడుగానే నడిపించారు. అయితే అదంతా కేసీఆర్ స్కెచ్ లోభాగమని ఇప్పుడు పార్టీ వాళ్లే అనుమానిస్తున్నారు. ఎన్నికల సీజను వచ్చాక.. పోటీకోసం సాయానికి బాలయ్యను సంప్రదించారు. అన్ని సీట్లలో పోటీని ప్రతిపాదించారు. దాన్ని వ్యతిరేకించిన బాలయ్య.. పార్టీ బలంగా ఉందని అనుకుంటున్న 85 సీట్లలో పోటీ చేస్తే చాలునని సూచించారు. తాను కూడా వచ్చి ప్రచారం చేస్తానని అన్నారు. కానీ కాసాని ఎవరితో సంప్రదించారో ఏమో గానీ.. 119 స్థానాలో తాము పోటీచేయబోతున్నట్టు ప్రకటించేశారు. బాలయ్యతో కలిసి ప్రకటన తర్వాత.. కేసీఆర్ సూచనల మేరకు, తెరవెనుక గైడెన్స్ మేరకే.. 119 చోట్ల పోటీ గురించి చెప్పారనేది పలువురి విశ్లేషణ.
ఈ కోవర్టు వ్యవహారం గుర్తించిన చంద్రబాబు అసలు పార్టీ పోటీ వద్దని తేల్చేశారు. తన కోవర్టు ఆపరేషన్ ఫెయిలయ్యేసరికి కాసాని గులాబీ గూటికే చేరుకున్నారు. అని ప్రజలు అనుకుంటున్నారు.
కాసాని కోవర్టు అని ముందే గుర్తించిన చంద్రబాబు!
Sunday, December 22, 2024