చిత్తూరు జిల్లా రాజకీయాలలో నారా చంద్రబాబు నాయుడు- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు ధ్రువాలు! పరస్పరం ప్రత్యర్థి పార్టీలలో కనబడుతూ ఉంటారు! ఇదే జిల్లాలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నప్పటికీ- కొమ్ములు తిరిగిన నాయకులుగా కొన్ని దశాబ్దాల నుంచి ప్రత్యర్థులుగా వీరిద్దరి మధ్య వైరమే ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది. ఈ ఇద్దరూ ఎస్వీ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల నుంచి రాజకీయ ప్రత్యర్థులు! వారి మధ్య ఆ వైరం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎంతో కీలకంగా చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- నారా చంద్రబాబునాయుడు ప్రాభవానికి గండి కొట్టాలని కూడా చూశారు. కుప్పంలో మునిసిపాలిటీని వైసీపీ దక్కించుకోవడంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. మునిసిపల్ ఎన్నికల కోసం మంత్రి ఏకంగా అక్కడే తిష్ట వేసి దగ్గరుండి రాజకీయాన్ని నడిపించడం రాష్ట్ర మొత్తం గమనించింది. పైగా కుప్పంలో చంద్రబాబు నాయుడు ను ఓడించాలని పెద్దిరెడ్డి కంకణం కట్టుకుని పనిచేశారు. అక్కడ తెలుగుదేశం నాయకులను ప్రలోభ పెట్టి వైసీపీలోకి తీసుకున్నారు. అలాంటి అనేక చర్యల పర్యవసానంగా కుప్పం మునిసిపాలిటీ వైకాపాకు దక్కింది.
ఆ పరాభవానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద స్వీట్ రివెంజ్ తీర్చుకున్నట్లుగా కనిపిస్తోంది. పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పుంగనూరు మున్సిపాలిటీని తెలుగుదేశం హస్తగతం చేసుకోనుంది. అక్కడి మునిసిపల్ చైర్మన్ ఆలీమ్ భాషాతో సహా 12 మంది కౌన్సిలర్లు తాజాగా చల్లా బాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ మున్సిపాలిటీ వైసీపీ చేజారినట్లే.
తన నియోజకవర్గంలో కుప్పం మునిసిపాలిటీని రకరకాల రాజకీయ మంత్రాంగం ద్వారా వైసిపి చేజిక్కించుకోవడానికి పెద్దిరెడ్డి సూత్రధారిగా ఉన్నారు. దానికి ప్రతీకారంగా స్వీట్ రివెంజ్ తీర్చుకున్నట్లుగా- ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చోట పుంగనూరు మునిసిపాలిటీని తెలుగుదేశం దక్కించుకున్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబునాయుడు తీర్చుకున్న స్వీట్ రివెంజ్!
Sunday, December 22, 2024