చంద్రబాబు నాయుడు గత ఎన్నికలలో నెగ్గిన తరువాత 4.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో క్యాబినెట్ కూర్పులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో … అదే విధానాన్ని, వ్యూహాన్ని ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణం విషయంలో కూడా అనుసరించబోతున్నారు. ఒకవైపు పార్టీలోని సీనియర్ల అనుభవాన్ని వాడుకుంటూనే.. కొత్త నేతలకు సారథ్యం అప్పగించడం ద్వారా.. పార్టీ వికాసంలో సమతూకం పాటించాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు సీనియర్ల అనుభవాన్ని పార్టీ కోసం మార్గదర్శనం రూపేనా వాడుకుంటూ.. ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేపేలా చురుకుగా వ్యవహరిస్తూ కష్టపడే బాధ్యతను కొత్త నేతల భుజస్కంధాలపై మోపడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. జాగ్రత్తగా గమనిస్తే ఇది క్యాబినెట్ కూర్పు సమయంలో అనుసరించిన వ్యూహమే అని మనకు అర్థమవుతుంది.
ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన తర్వాత తిరుగులేని మెజారిటీతో చంద్రబాబు నాయుడు 4.0 ప్రభుత్వం ఏర్పడింది. పార్టీ తరఫున గెలిచిన వారిలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. అలాగే మంత్రి పదవులకు అర్హమైన స్థాయి కలిగిన ఎందరో సీనియర్లు పొత్తులలో భాగంగా ఇతర కూటమి పార్టీల కోసం తమ తమ స్థానాలను త్యాగం చేశారు. గెలిచిన వారిలో కూడా మంత్రి పదవులకు తగిన అర్హతలు కలిగిన సీనియర్లు అనేక మంది ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు కేబినెట్ కూర్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించారు. సీనియర్లు చాలా మందిని పక్కన పెట్టారు. కొత్త రక్తాన్ని కేబినెట్ లోకి తీసుకున్నారు. మంత్రి పదవుల కోసం అలకలు పూనడం తగదని.. పార్టీ, ప్రభుత్వ, ప్రజా ప్రయోజనాలు ముఖ్యం అని అందరికీ ముందునుంచి నచ్చజెప్పారు. కేబినెట్ ప్రకటన తర్వాత.. వీసమెత్తు అసంతృప్తి కూడా బయటకు రాలేదు. కొత్త మొహాలు కూడా సమతూకంగా ఏర్పడిన కేబినెట్ ఆవిష్కృతమైంది. అదే సమయంలో సోషల్ ఇంజినీరింగ్ పేరుతో కులాల సమతూకాన్ని కూడా చంద్రబాబు కేబినెట్లో పాటించారు.
ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణంలో కూడా అచ్చంగా ఇదే వ్యూహాన్ని ఆయన అనుసరించాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సీనియర్ల అనుభవానికి పెద్దపీట వేస్తూనే.. ప్రజలతో మమేకం అయ్యే కార్యభారం మోయవలసిన పార్టీ పదవుల్లోకి యువనేతల్ని, కొత్త నేతల్ని తీసుకోవాలని అనుకుంటున్నారు. సోషల్ ఇంజినీరింగ్ సరేసరి. ఇలాంటి వ్యూహం.. సత్ఫలితాలనే ఇస్తున్నదని పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
