చంద్రబాబు అరెస్టు : అనుకున్నదే అయింది!

Wednesday, January 22, 2025

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్టుచేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న ఆయన బసవద్దకు అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్దసంఖ్యలో చేరుకున్న పోలీసులు.. సుదీర్ఘమైన హైడ్రామా అనంతరం శనివారం ఉదయం చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. నోటీసులు ఇచ్చి స్కిల్ డెవలప్ మెంటు కేసులో అరెస్టు చేస్తున్నట్టుగా ప్రకటించారు.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. చంద్రబాబు బస వద్ద పోలీసులు పెద్ద హైడ్రామా సృష్టించారు. ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబు బస్సులోనే బసచేశారు. నంద్యాల అనంతపురం పోలీసులు సుమారు ఆరు బస్సుల్లో అరెస్టు కోసం తరలివచ్చారు. అర్ధరాత్రి ఆయనను నిద్ర లేపడానికి వీల్లేదని, ఉదయం నిద్రలేచిన తర్వాత మాట్లాడవచ్చునని తెలుగుదేశం నాయకులు ఎంతగా చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. వాహనం వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్న తెలుగుదేశం నాయకులు అందరినీ అరెస్టు చేశారు. చంద్రబాబు నిద్రిస్తున్న బస్సు తలుపు కొట్టడం ద్వారా ఆయనను నిద్రలేపాలని పోలీసులు ప్రయత్నించారు. దానికి తగినట్టుగా బస్సు చుట్టూ పోలీసులతో రోప్ పార్టీ ఏర్పాటు చేశారు.

అయితే చంద్రబాబుకు రక్షణ కవచంగా ఉన్న ఎస్ఎస్‌జీ పోలీసులు అందుకు అనుమతించలేదు. వీఐపీ ప్రోటోకాల్ ప్రకారం.. ఏ చర్య తీసుకోవాలన్నా సరే.. ఉదయం అయిదున్నర గంటల తర్వాత మాత్రమే అని ఎస్ఎస్‌జీ కమాండోలు పోలీసులకు తేల్చి చెప్పారు. దాంతో వెనక్కు తగ్గిన పోలీసులు ఉదయం ఆరు గంటల సమయంలో చంద్రబాబును అరెస్టు చేశారు.

పోలీసులు తనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నదని చంద్రబాబునాయుడు కొన్ని రోజులుగా చెబుతున్నారు. నంద్యాలలో నడిపించిన హైడ్రామా ద్వారా ఆయన అనుమానించినదే నిజమైంది. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో అరెస్టుకు రావడం.. అడ్డుకునే వారినందరినీ అరెస్టు చేయడం.. పోలీసులకు అడ్డుగా పెట్టిన వాహనాలు అన్నింటినీ.. జెసిబిలతో తొలగించడం వంటి చర్యల ద్వారా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ప్రతిపక్షానికి చెందిన వారినందరినీ ఒకసారి అరెస్టు చేసి జైల్లో పెట్టడం అనేది వైఎస్సార్ కాంగ్రెస్ వారి లక్ష్యం అని, ఏదో ఒక సాకు చూపి అరెస్టు అనే పర్వం పూర్తి చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles