జగన్ పోగొట్టుకున్నదే.. దక్కించుకుంటున్న చంద్రబాబు!

Saturday, March 22, 2025

సాధారణంగా తెలివైన వాళ్లు తమ లోపాల నుంచి, తమకు తగిలిన ఎదురుదెబ్బల నుంచి తాము పాఠాలు నేర్చుకుంటారు. అదే గొప్పవాళ్లు ఇతరులకు తగిన ఎదురుదెబ్బల నుంచి పాఠాలు నేర్చుకుంటారు.. తమను తాము దిద్దుకుంటారు.. అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్ లో చాలా పాపులర్ సిద్ధాంతం. ఇప్పుడు చంద్రబాబునాయుడు ఈ సిద్దాంతం ప్రకారం తన స్థాయి ఏమిటో నిరూపించుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో ఉద్యోగులను శత్రువుల్లాగా పరిగణిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు చంద్రబాబునాయుడు.. అన్ని వర్గాల మాదిరిగానే ఉద్యోగ వర్గాల్లో కూడా ఆదరణ మూటగట్టుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు రూ.6200 కోట్లను శుక్రవారం విడుదల చేయనున్నారు.

జగన్మోహన్ రెడ్డి తాను పరిపాలన సాగించిన రోజుల్లో ఉద్యోగులను చాలా చిన్నచూపు చూశారనే పేరుంది. అంతే కాదు. వారి ఏ సహేతుక డిమాండ్లు అయినా సరే.. జగన్ కు గొంతెమ్మ కోరికలుగానే కనిపించేవి. అధికారంలోకి వస్తే వారం రోజుల్లో పాతపెన్షన్ స్కీం పునరుద్ధరిస్తానని పాదయాత్ర సమయంలో మాటఇచ్చి.. ఆ వర్గానికి చెందిన ఉద్యోగులను దారుణంగా దగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే వారి పీఎఫ్ నిల్వలను ఇతర ఖాతాల్లోకి మళ్లించారు. ఉద్యోగులకు రావాల్సిన డబ్బులన్నీ బకాయిలు పెట్టారు. వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.

మామూలుగా పెద్దలు పారేసుకున్న చోటే వెతుక్కోవాలంటారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే పారేసుకున్నారో.. అక్కడ చంద్రబాబునాయుడు వెతుక్కుంటున్నారు. ఉద్యోగవర్గాలకు జరిగిన నష్టాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఎం కింద రూ.6200 కోట్లు శుక్రవారం నాడు ఆర్థిక శాఖ విడుదల చేయబోతోంది.

రాష్ట్రప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు అనేవి నిన్నటికీ ఇవాళ్టికీ పెద్ద మార్పు ఏం లేదు. ఆర్థిక పరంగా రాష్ట్రానికి జగన్ చేసిన ద్రోహాలన్నింటినీ చక్కదిద్దుకుంటూ అంతకంటె మెరుగైన పాలన అందించడానికి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. జగన్ సర్కారు చేసిన సంక్షేమపథకాలు అన్నింటినీ అంతకంటె మెరుగ్గా అందజేస్తూ.. వాటితో పాటూ వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను కూడా అమలు చేస్తున్నారు.

సరిగ్గా చెప్పాలంటే.. జగన్ ప్రభుత్వం కాలంలో అవుతున్న వ్యయం కంటె ఇప్పుడు రెట్టింపు అవుతోంది. అయితే జగన్ లాగా.. ఉద్యోగులకు రావాల్సిన బకాయిల విషయంలో సాకులు చెబుతూ దాటవేసే ధోరణిని ఈ ప్రభుత్వం అనుసరించడం లేదు. జగన్ పెట్టిన బకాయిలు అన్నింటినీ కూడా తక్షణం చెల్లించేయాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులు నీరాజనం పడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles