తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పట్ల- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఆచితూచి, అతి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కొలికపూడి శ్రీనివాసరావు గురించి నియోజకవర్గంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ చంద్రబాబు ఇప్పటిదాకా మందలించడం కూడా జరగలేదు. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఎమ్మెల్యే పనితీరు గురించి, కార్యకర్తలతో వ్యవహరిస్తున్న తీరు గురించి, నోటి దురుసుతనం గురించి రకరకాల అంశాలపై కార్యకర్తల, ప్రజల మనోభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం జరిగింది. అయితే ఇప్పటిదాకా శ్రీనివాసరావును చంద్రబాబు మందలించడం మాత్రం జరగలేదు. ఎస్సీ నియోజకవర్గానికి చెందిన నోటి దూకుడు గల ఎమ్మెల్యే కావడంతో చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అనునయంగా నచ్చజెప్పి ఆయన మాటతీరులో ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన నియోజకవర్గ పరిధిలోని చిట్యాల సర్పంచ్ పై ఆరోపణలు కురిపించారు. అలాగే ఆయన పని తీరుపై కూడా పార్టీలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కార్యకర్తలతో సమావేశమైన శ్రీనివాసరావు ఆ వెంటనే పార్టీ కార్యాలయం వద్దనే దీక్షకు ఉపక్రమించడం కోసమేరుపు. ఇంతకూ దీక్ష ద్వారా ఆయన డిమాండ్ చేస్తున్నది తన పార్టీ నాయకత్వాన్నే కావడం విశేషం. తన మీద కొందరు ఆరోపణలు చేస్తున్నారని వాటి గురించి పార్టీ పరిశీలించి, తప్పు ఎవరిదో తేల్చి చెప్పాలని ఎమ్మెల్యే శ్రీనివాసరావు కోరుతున్నారు.
అయితే కేవలం నోటి దురుసుతనం మాత్రమే కాకుండా.. ఇసుక అక్రమ దందాలతో సహా శ్రీనివాసరావు పై అనేక ఆరోపణలు ఉన్నాయి. చిట్యాల సర్పంచితో ఆయన వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో వీలైనంత త్వరగా పార్టీ అధిష్టానం జోక్య చేసుకుంటే తప్ప నియోజకవర్గంలో పార్టీ పరువు దక్కే పరిస్థితి లేదు. మరొకవైపు చంద్రబాబు నాయుడు తాను నేరుగా శ్రీనివాసరావుతో మాట్లాడకుండా పార్టీలోని ఇతర సీనియర్లు కొందరితో మాట్లాడించడం ద్వారా బుజ్జగించాలని చూస్తున్నట్లుగా, తీరు మార్చుకోవాలని హెచ్చరించదలచుకున్నట్టుగా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కొలికపూడి శ్రీనివాసరావు ఎలా స్పందిస్తారో, ఎలాంటి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటారో వేచి చూడాలి.