మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిలు రావడం అనేది తాజా కీలక పరిణామం. చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఇదే కేసులో మధ్యంతర బయలుకై బయటే ఉన్నారు. అయితే ఆయన కదలికలపై కొన్ని ఆంక్షలు ఉన్నాయి. తాజాగా ఈ కేసులో ఆయనకు పూర్తిస్థాయి బెయిలు మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. కాస్త లోతుగా గమనిస్తే.. చంద్రబాబు నాయుడుకు బెయిలు వచ్చిందా లేదా అనేది ఇక్కడ ప్రధాన అంశం కానే కాదు. ఈ తీర్పు సందర్భంగా న్యాయమూర్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది ముఖ్యంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో వందల కోట్ల రూపాయల సొమ్మును స్వాహా చేశారని ఆరోపిస్తూ సిఐడి చంద్రబాబు మీద కేసు పెట్టి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యల్లో, సిఐడి ఆరోపణలు దేనితోనూ న్యాయమూర్తి ఏకీభవించకపోవడం గమనార్హం. దాదాపుగా ప్రతి ఆరోపణను ఆయన కొట్టి పారేశారు.
ఈ కేసు విచారణ మొదలై 22 నెలలు అవుతుంది అని.. ఇప్పుడు చంద్రబాబును అరెస్టు చేశారని.. ఇలాంటి సమయంలో ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని అనడంలో అర్థం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఒకవేళ సాక్షులను ప్రభావితం చేసే వ్యక్తి అయితే గనుక అది ఇప్పటికే జరిగి ఉండాలి. ఇప్పుడు ఆ కారణం చూపి ఆయనను కచ్చితంగా జైలులోనే నిర్బంధించాలని వాదనలో నిజం లేదు అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న చంద్రబాబు నాయుడు.. కేసు విచారణ నుంచి తప్పించుకుపోయే అవకాశం లేదని పేర్కొంటూ ఆయనకు పూర్తిస్థాయి బెయిలు మంజూరు చేశారు. ఈ తీర్పుతో.. ఈ నెల 28వ తేదీన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తిరిగి లొంగి పోవలసిన అవసరం లేకుండా పోయింది.
మధ్యంతర బయలు సందర్భంగా విధించిన ఆంక్షలు అన్నీ కూడా 28వ తేదీ వరకు మాత్రమే వర్తిస్తాయని.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాజకీయ ర్యాలీలు సభలు నిర్వహించవచ్చునని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకుండా ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు చెప్పిన ఈ తీర్పు ద్వారా చంద్రబాబు నాయుడును అక్రమ కేసులతో వేధించి జైలులో నిర్బంధించాలని ప్రయత్నించిన ప్రభుత్వం కుట్రలకు చెంపపెట్టు పడినట్లు అయింది. స్కిల్ కేసు కోర్టు ఎదుట నిలబడదని ముందే తెలిసినట్లుగా.. చంద్రబాబు మీద ఇంకా అనేక రకాల కేసులను బనాయించిన ప్రభుత్వం.. ఈ తీర్పు తర్వాత ఏం చేయబోతుందో చూడాలి.