ఏపీలో ప్రభుత్వం ప్రస్తుతం పోలీసు యంత్రాంగాన్ని ఏ రీతిగా వాడుతున్నదనే విషయంలో అనేకానేక అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీ పెద్దలు పోలీసులను తమ తొత్తుల్లాగా, తైనాతీల్లాగా, పనివాళ్లలాగా వాడుతున్నారనే వాదనలు మనకు వినిపిస్తుంటాయి. తాము చేస్తున్న పని తప్పు అనే సంగతి వారి అంతరంగానికి కూడా చాలా స్పష్టంగా తెలిసినప్పటికీ.. కేవలం వైసీపీ నాయకుల ఒత్తిడి, పెత్తనం వలన పోలీసులు హద్దులు మీరి, నిబంధనలను అతిక్రమించి పనిచేస్తుండడం చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ వారు ఎలా తమ మీద చెలరేగుతున్నారో వారికి తెలుసు. అలాంటిది.. చంద్రబాబు నాయుడు పోలీసుల పట్ల ప్రదర్శించిన తన సంస్కారానికి వారు అచ్చెరువొందుతున్నారు.
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబు వెళ్లిన సందర్భంగా.. పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు పొడవునా బారికేడ్లు, పోలీసు వాహనాలు అన్నీ పెట్టి మరీ అడ్డుకున్నారు. కనీసం అయిదుగురిని మాత్రం డ్యాం వరకు పంపాలని అడిగినా కూడా అనుమతించలేదు. అయితే చంద్రబాబు అప్పటికే అక్కడ గుమికూడిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మళ్లీ పోలవరం సందర్శనకు వస్తానని చెప్పాలంటూ.. ఎప్పుడు రావాలో చెప్పండని డీఎస్పీ లతాకుమారిని అడిగారు. జలవనరుల శాఖ అనుమతి తెచ్చుకుంటే అభ్యంతరం లేదని ఆమె చెప్పారు. ఇక్కడి పోలీసులు చట్ట ప్రకారం నడుచుకుంటామని చెప్పినందున వారికి థాంక్స్ చెప్పి చంద్రబాబు ముగించారు.
అయితే చంద్రబాబు నాయుడు పోలీసుల మీద రెచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘మీ అంతు చూస్తా’ అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు ప్రభుత్వ ఉద్యోగుల్లాగా కాకుండా పచ్చి రాజకీయ కిరాయి మూకల్లాగా ప్రవర్తించినప్పుడు మాత్రమే ఆయన రెచ్చిపోయారు. పోలవరం పర్యటన సందర్భంగా అడ్డుకున్న పోలీసుల పట్ల తన సంస్కారాన్ని చూపించారు.
ఆ మాటకొస్తే.. పవన్ కల్యాణ్ కూడా పోలీసు వ్యవస్థ పట్ల చాలా గౌరవంతో స్పందిస్తుంటారు. నేను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకునే పవన్ కల్యాణ్.. పోలీసు వ్యవస్థ పట్ల తనకెంతో గౌరవం ఉందని, ఆ వ్యవస్థని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని అంటూ ఉంటారు. ఈ నాయకులు ప్రదర్శిస్తున్న సంస్కారం అధికార పార్టీలో ఉన్నదా అనే ఆలోచన పోలీసుల్లోనే మొదలవుతోంది.
విశాఖలో కోడికత్తి దాడి జరిగితే.. ఏపీ పోలీసుల మీద తనకు నమ్మకం లేదని హైదరాబాదు వెళ్లిపోయి అక్కడ ఫిర్యాదుచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన పాలనలో.. వైసీపీ ప్రతి చిన్న నాయకుడు కూడా పోలీసులను తమ పనివాళ్లులాగా భావిస్తూ పెత్తనం చేస్తున్నారనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది.