..పరమాన్నం పెడతాడా? అనేది ఇప్పుడు జనం మదిలో మెదలుతున్న ప్రశ్న. సంక్షేమం అనగా.. తలా కొంత డబ్బు వెదలజల్లడం మాత్రమే.. అన్నట్టుగా తాను రాసుకున్న నిర్వచనం ప్రకారం పాలన సాగించుకుంటూ పోతున్న జగన్మోహన్ రెడ్డి తతిమ్మా విషయాలను పూర్తిగా గాలికొదిలేశారని రాష్ట్రంలో పరిణామాలను గమనించిన ఏ ఒక్కరికైనా అర్థమవుతుంది. ప్రజలు కోరుకునే సంగతులు, వారు పడుతున్న అవస్థలు, వారి కష్టాలు ఇవేవీ జగన్ కు కనిపించవు. ప్రజలు తమ కష్టాలను నివేదించుకునే ప్రయత్నం చేయాలనుకుంటే.. ఆయన అసలు అందుబాటులోనే ఉండరు. ఏదో ఒక రూపంలో వారు సమస్యలని బయటపెడితే.. ప్రతిపక్షాలు పురిగొల్పి జనంతో నాటకాలు ఆడిస్తున్నాయని, వారంతా పెయిడ్ ఆర్టిస్టులని అంటూ ప్రజలను అవమానించే మాటలతో వైసీపీ వారు విరుచుకుపడతారు. ప్రజలు ఎవరైనా తమ కష్టాల గురించి ఆక్రోశాన్ని కాస్త తీవ్రంగా ఏ సోషల్ మీడియాలోనో వెళ్లగక్కితే వారి మీద సీఐడీ కేసులు పెట్టి.. భయభ్రాంతులకు గురిచేస్తారు. ఇంతకూ.. తాను అనుకున్నవి కాకుండా.. ప్రజల కష్టాలు తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి జగన్ ఏం చేస్తున్నారు.
కడపజిల్లాలో అన్నమయ్య జలాశయం కట్ట తెగి ఇళ్లన్నీ నేలమట్టం అయిపోతే.. ఆ బాధితులకు ప్రభుత్వం ఇప్పటిదాకా వేరే ఇళ్లు నిర్మించి ఇవ్వనేలేదు. వారి డిమాండ్ చాలా న్యాయమైనది. కేవలం ప్రభుత్వ వైఫల్యం, కాంట్రాక్టర్ల దుర్మార్గమైన అవినీతి కారణంగా.. కట్ట తెగింది. బతుకులు నాశనం అయ్యాయి. ప్రభుత్వం అప్పటికప్పుడు వారికి కంటితుడుపుగా డబ్బు పంచి.. అక్కడితో చేతులు దులిపేసుకుంది. ఇళ్లు పూర్తిగా కోల్పోయిన వాళ్లకి మూడు నెలల్లోగా కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది గడుస్తున్నా ఇప్పటిదాకా అతీగతీ లేదు. వారి కుటుంబాల్లో యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. దానికీ దిక్కులేదు. తాజాగా జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించడంతో.. అన్నమయ్య జలాశయం ముంపు బాధితుల గోడు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాకు చెందిన వారు.. తమ తప్పేమీ లేకుండా దారుణంగా నష్టపోయిన వారు.. ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వగల సాయానికి సంపూర్ణంగా అర్హులు. అయినా వారి గురించి జగన్ ఎందుకు పట్టించుకోవడంలేదో అర్థం కాదు. సొంతజిల్లాకు చెందిన వారికే సాయం చేయని ముఖ్యమంత్రి.. రాష్ట్రమంతా లక్షల సంఖ్యలో జగనన్న ఇళ్లు కట్టించి ఇచ్చేస్తాడంటే ఎలా నమ్మడం? అవైతే కేంద్రప్రభుత్వం సొమ్ములతో తన పేరు పెట్టుకుని కట్టే ఇళ్లు గనుక చేయవచ్చునని, ముంపు బాధితులకు కట్టించాల్సి వస్తే.. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సొమ్ముతో కట్టించాల్సి వస్తుందని జగన్ ఇలా ఎగవేస్తున్నారా? అనేది బోధపడదు! అందుకే, సొంత జిల్లా బాధితులనే పట్టించుకోని జగన్ తీరు గురించి ప్రజలు, అమ్మకు అన్నం పెట్టని జగన్, పిన్నమ్మకకు పరమాన్నం పెడతాడా అని నవ్వుకుంటున్నారు.