పాపం బుగ్గన.. జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఆర్థిక శాఖ చూడడం అంతటి నరకం మరొకటి ఉండదేమో అని ప్రతిక్షణం అనుకుంటూ ఉండవచ్చు. అందుకే కాబోలు.. వచ్చే ఎన్నికలలో తాను పోటీచేయనంటే చేయనని ఆయన భీష్మించుకుంటున్నారు. తన వారసుడిని రంగంలోకి దింపాలని అనుకుంటున్నారు. అయితే.. తనకంటె పెద్దవాళ్లయిన విధేయులు నెమ్మదిగా జారుకుంటే.. అందరూ పిల్లనేతలతో పార్టీ, ప్రభుత్వం ఘనంగా కనిపించదేమో అనే ఉద్దేశంతో.. జగన్ ఇప్పుడు సిటింగులు అందరూ ఈసారి పోటీచేయాల్సిందే అంటూ వారిని బలవంత పెడుతున్నాడు.. ఈ ఎపిసోడ్ మొత్తం పక్కన పెడితే.. ఆర్థిక శాఖ నిర్వహణలోను, అప్పుల వ్యవహారాల గురించి ప్రభుత్వం వేస్తున్న అడుగులను సమర్థించుకోవడంలోను బుగ్గన నానా పాట్లు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.
అప్పుల్లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నదని.. మన ఆర్థిక దుస్థితి గురించి కాగ్ నివేదిక సాక్షిగా ప్రజలకు తెలిసిపోయింది. ఏడాదికి సరిపడా బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పులను కేవలం తొలి ఆరునెలల్లోనే పూర్తిగా తీసుకోవడం మాత్రమే కాదు.. ఖర్చుచేసేయడం కూడా అయిపోయిందని ఏపీ విషయంలో విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నది.. అనేది కళ్లెదురుగా సాక్ష్యాలతో సహా కనిపిస్తున్న సత్యం.
అప్పులు పుడితే తప్ప.. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేకపోతోందన్నది.. ప్రతినెలా అనుభవంలోకి వస్తున్న సత్యం. ఏ నెలకు ఆనెల.. ఈ నెల జీతం అకౌంట్లో పడితే చాలురా భగవంతుడా.. అని ఉద్యోగులు జోకులు, మీమ్ లు షేర్ చేసుకుంటున్న విషయం వాస్తవం. ఇలాంటి నేపథ్యంలో.. కాగ్ నివేదిక.. ఏపీ ఆర్థిక దుస్థితిని, అప్పుల బాగోతాన్ని ఎండగట్టడంతో.. వ్యవహారం బజార్న పడింది. ‘తమరు అప్పుల్లో ముంచేస్తున్నారు బాబయ్యా’ అని ఈ నివేదిక చూసిన ప్రజలు భయపడుతోంటే.. దేశంలో అన్ని రాష్ట్రాలూ అప్పులు చేస్తున్నాయిలే.. అంటూ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఏడాది 15% అప్పులు పెరుగుతోంటే.. టీడీపీ హయాంలో 20% శాతం పెరిగాయని అంటున్నారు. శాతాలు ఎవరు అడిగారు.. పోనీ టీడీపీ అతిగా అప్పులు చేసిందనే భావన ఉంటే.. వారు చేసిన మొత్తం అప్పులు ఎంతో, వైసీపీ చేసిన మొత్తం అప్పులు ఎంతో గణాంకాల్లో చెప్పగల ధైర్యం బుగ్గన కు ఉందా? అనేది ప్రజల సందేహం.
ఇలాంటి మసిపూసి మారేడుకాయ చేసే మాయ మాటలతో.. రుణాంధ్రప్రదేశ్ ను మెరిసిపోయే ఆంద్రప్రదేశ్ ప్రజలను నమ్మించడం కష్టం. ఏడాదికి యాభైవేల కోట్లు అప్పులు లక్ష్యంగా ఉన్నాయి. దీనికి అనుగుణంగానే అప్పులు తీసుకుంటున్నాం అంటున్న బుగ్గన.. కార్పొరేషన్లు, ఇతర సంస్థల రూపేణా పుట్టిస్తున్న వేల కోట్ల రుణాలను కూడా లెక్కలో చూపించమంటే.. ఇంకెంత కంగారుపడతారో?