జగన్ దుర్మార్గాలను బయటపెట్టేలాగా బొత్స మాటలు!

Wednesday, December 18, 2024

అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దేశమంతటా కూడా చాలా సంచలనం రేకెత్తిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా సినీరంగం మాత్రమే కాకుండా, రాజకీయ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ అరెస్టు పట్ల స్పందిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. ఈ అరెస్టు జరగకుండా ఉన్నట్లయితే, ఇదే నిందితులు ప్రముఖులు కాకుండా ఇతరులు అయి ఉంటే ఒక్కరోజులో అరెస్టు చేసి ఉండేవారు కదా.. అంటూ పోలీసులనే అందరూ నిందిస్తున్నారని.. అర్జున్ అరెస్టును అందరూ కలిసి రాజకీయం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా గట్టిగానే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ ను సమర్థించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి, శాసనమండలిలో పార్టీనేత బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో జరిగిన పోలీసు దుర్మార్గాలను బయటపెట్టేలా కనిపిస్తున్నాయి.

జగన్ ప్రభుత్వం కాలంలో.. తెలుగుదేశం, జనసేనకు చెందిన నాయకుల్ని ఎన్ని రకాలుగా  వేధించారనేది అందరికీ తెలుసు. పోలీసులను అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగా ఎలాంటి అరెస్టులకు పాల్పడ్డారో అందరికీ తెలుసు. కేవలం అరెస్టులు మాత్రమే కాదు. అసలు ప్రతిపక్ష నాయకుల కదలికల్ని కూడా నియంత్రించేలా ఎంత దుర్మార్గంగా జగన్ పరిపాలన కాలంలో పోలీసు చర్యలు ఉండేవో ప్రజలందరూ గమనించారు కూడా. నారాలోకేష్ పాదయాత్ర చేస్తే.. అడుగడుగునా పోలీసులు ఎలాంటి ఆటంకాలు సృష్టించారో, కనీసం ఆయన మైకులో మాట్లాడకుండా  ఎలా అడ్డుకున్నారో.. వాహనం ఎక్కి మాట్లాడకుండా ఎలా అడ్డుకున్నారో అన్నీ ప్రజలు గమనించారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకోవడానికి జనసేనాని పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమాలను నిర్వహిస్తే.. వాటిని ఎలా అడ్డుకున్నారో కూడా ప్రజలు చూశారు.

విశాఖపట్నం వెళ్లిన పవన్ కల్యాణ్ అసలు ప్రజల్లో ఎవ్వరినీ కలవకుండా.. ఆయనను దాదాపుగా హౌస్ అరెస్టు చేసి.. హోటలు గదినుంచి బయటకు కదలనివ్వకుండా నిర్బంధించి.. అటునుంచి అటే వెనక్కు పంపిన సంగతి కూడా ప్రజలు చూశారు. ఈ అన్ని సందర్భాల్లోనూ అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు పలికిన చిలకపలుకులు ఒక్కటే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని!
ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అదే మాట చెబుతోంటే.. ఆ మాటల వెనుక వ్యవహారం వేరే ఉంటుందని బొత్స సత్యనారాయణ అంటున్నారు.

పోలీసులు వారంతట చర్యలు తీసుకోవడం అనేది ఉండదని, ప్రభుత్వం లోని పెద్దలు నిర్ణయాలు తీసుకోకుండా, వారు పురమాయించకుండా పోలీసులు అసలు ఎలా పనిచేస్తారు? అని బొత్ససత్యానారాయణ  అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. అంటే గత అయిదేళ్లలో జగన్ పాలన కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ‘చట్టం తన పని తాను ఎలా చేసుకువెళ్లిందో’ అర్థమవుతోందని ప్రజలు అంటున్నారు. పోలీసులు ప్రతిపక్షాల వారిని వేధించిన ప్రతి సందర్భంలోనూ వైసీపీ ప్రభుత్వ పెద్దలే వాటి వెనుక ఉన్నారని ఇప్పుడు అర్థమవుతోంది. ఎక్కడైనా సరే.. చట్టం తన పని తాను చేసుకు పోవడం నిజమేనని.. కానీ బొత్స మాటలను బట్టి.. వారి జమానాలో మాత్రం.. ప్రభుత్వంలోని పెద్దలకు తొత్తులుగా పోలీసు వ్యవస్థను మార్చేసినట్టు తెలుస్తున్నదని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles