కేంద్రం మీదికి నెట్టేస్తున్న బొత్స తెలివితేటలు!

Friday, November 15, 2024

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక విషయంలో స్పష్టత ఇచ్చేశారు.  ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమల్లోకి తీసుకురావాల్సిందే..  అని సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న వారికి ఆయన చేదు మాట వినిపించారు.  పాత పెన్షన్ విధానం అనేది ముగిసిపోయిన అధ్యాయం అని సెలవిచ్చారు.  తమ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం- జిపిఎస్ లు తీసుకు వస్తున్నదని చాటుకున్నారు.  అయితే పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకురావడం అనేది అసాధ్యం అని చెబుతూ..  అందుకు కేంద్రమే కారణం అన్నట్లుగా బిజెపి సర్కారు మీదికి నెపం నెట్టేయడమే బొత్స  సత్యనారాయణ రాజనీతికి నిదర్శనం గా కనిపిస్తోంది. 

 శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన జిపిఎస్ మీద ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను ఖండించారు.  జిపిఎస్ అందరికీ ఆమోదయోగ్యం అవుతుందని తాము చెప్పలేదని,  వారి నుంచి ఆందోళన వ్యక్తం కాకుండా ఉంటుందని కూడా తాము అనలేదని చెప్పారు.   జిపిఎస్ బిల్లుకు క్యాబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో బొత్స మాటలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.  అయితే పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావడానికి కేంద్రం అంగీకరించడం లేదు అని సత్యనారాయణ చెప్పడమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.  వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తన పాదయాత్ర సందర్భంగా..  తనని గెలిపించినట్లయితే వారం రోజుల్లోగా పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరిస్తారని ఉద్యోగ వర్గాలకు హామీ ఇచ్చారు.  జగన్ మాటను నమ్మి లక్ష్యాల సంఖ్యలో ఉద్యోగులు ఆయన నిర్ణయానికి పార్టీకి మద్దతు ఇచ్చారు.  అయితే గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్..  ఆ హామీని పక్కన పెట్టారు.  సుదీర్ఘకాలం ఉద్యోగ వర్గాల నుంచి వినతులు రావడం,    ఆందోళనలు వ్యక్తం కావడం జరిగాయి!  తర్వాత ఉద్యోగ వర్గాలతో చర్చలు ప్రారంభించి,  జిపిఎస్ అనే కొత్త పద్ధతిని అమలులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వం చెబుతున్న ఈ జిపిఎస్ అనేది,  కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం కంటే దారుణంగా ఉన్నదని ఉద్యోగ వర్గాలు వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలుసు.  వారి అభ్యంతరాలను ప్రభుత్వం ఖతలు చేయడం లేదు.  పైగా ఇప్పుడు పాత పెన్షన్ విధానం తీసుకురావడానికి కేంద్రం అడ్డుపడుతున్నట్లుగా బొత్స మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 

 ఏ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం.  హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్,  ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు,  పంజాబ్ లో ఉన్న ఆమ్ ఆద్మీ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాయి.  వారికి కేంద్రం అడ్డుపడడం అంటూ జరగలేదు. . హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు  కూడా తెలంగాణలో కూడా ఒక సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు కూడా! వారందరికీ సాధ్యమవుతుండగా,  బొత్స సత్యనారాయణ మాత్రం కేంద్రం మీదకు నెపం నెట్టేయడం చిత్రంగా కనిపిస్తోంది.   ప్రభుత్వ వ్యవహార సరళి పట్ల ఉద్యోగ వర్గాలలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి,  అగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles