‘మనవాడు ప్రధానిగా ఉన్నాడు.. మనం ఆ పార్టీనే నెత్తిన పెట్టుకోవాలి..’ అనే స్థానికత మంత్రం పనిచేసిందా.. లేదా, నిజంగానే బిజెపి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి ఏడోసారి కూడా ఆ పార్టీకి అధికారం కట్టబెట్టిందా? మొత్తానికి బిజెపి రికార్డు సృష్టించింది. గుజరాత్ లో విజయాన్ని మోడీ సాధించిన వ్యక్తగత విజయంగానే పలువురు భావిస్తున్నారు. ఆయన వన్ మ్యాన్ షో గా ఎన్నికల ప్రచారాన్ని భుజాన వేసుకుని.. ఈ విజయాన్ని అందించారని కీర్తిస్తున్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో మోడీని ఇష్టపడేవారు, ఆయనను వ్యతిరేకించే వారు కూడా.. ఇప్పుడు మోడీ పట్ల తమ అభిప్రాయాలను పునర్నిర్వచించుకుంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ ఓటమి అనేది బిజెపికి కించిత్ బాధాకరం. అయితే.. అక్కడ ప్రతి ఎన్నికల్లోనూ అధికార మార్పిడి అనేది ఒక సాంప్రదాయంగా అలవాటైపోయినందున పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ.. గుజరాత్ లో ఏకంగా ఏడోసారి అధికారంలోకి రావడం అనేది చరిత్రగా అందరూ భావిస్తున్నారు. అది కూడా 2017 ఎన్నికల్లో కేవలం 99 స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన పార్టీ.. బిజెపి ప్రాభవం రాష్ట్రంలో తగ్గడం ప్రారంభం అయిందని, వచ్చే ఎన్నికలనాటికి అధికారం కోల్పోతారని అప్పట్లో విమర్శలను ఎదుర్కొన్న పార్టీ.. తిరుగులేని బలమైన శక్తిగా ఈ ఎన్నికల్లో ఆవిర్భవించింది.
ఎవ్వరెన్ని మాటలు అన్నప్పటికీ నరేంద్రమోడీ సర్కారు మీద అవినీతి ఆరోపణలు లేకపోవడం అనేది దేశవ్యాప్తంగా బిజెపి ఆదరణ పెరుగుతుండడానికి ఒక కీలక కారణం. పైగా, వారణాశి ఎంపీగా దేశానికి ప్రధాని అయినప్పటికీ.. తన మూలాలను విస్మరించకుండా ఉన్న వ్యక్తి నరేంద్రమోడీ. ఆయన గుజరాత్ లోనే మొన్నటి ఎన్నికల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీకి రాజా అయినా అమ్మకు కొడుకే అనే సామెత చందంగా తాను హస్తిననుంచి దేశాన్ని ఏలుతున్నప్పటికీ మౌలికంగా తాను గుజరాతీనే అనే భావనను అందరికీ కలిగించారు. గుజరాత్ లో అనన్యమైన ప్రజాదరణ మోడీ సొంతం. ఆయన చేసిన ప్రచారం పార్టీకి పెద్దగా లాభించింది.
అందుకే రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే.. హిమాచల్ ప్రదేశ్ లో చేతిలో ఉన్న అధికారాన్ని కోల్పోయినా సరే.. బిజెపిని పెద్దగా ఎవ్వరూ విమర్శించడం లేదు. గుజరాత్ లో విజయమే.. పార్టీకి అనన్యమైన ప్రతిష్ఠను ఇతర పరాజయాలను మరపించే ప్రతిష్టను తెచ్చిపెట్టింది. అందుకే ఈ విజయాన్ని మోడీ రెక్కల కష్టంగానే అభివర్ణించాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ అన్యాయం చేశారని, ప్రత్యేకహోదా ఇవ్వకుండా వంచించారని నమ్మేవారు కూడా.. ఇతర అంశాల వరకు వచ్చేసరికి.. మోడీ వైఖరిని తప్పుపట్టరు. ఆయన పట్ల నమ్మకాన్నే చూపిస్తారు. ప్రధానిగా నరేంద్రమోడీకి గానీ, భారతీయజనతా పార్టీకి గానీ అదే పెద్దబలం.