ఏపీ భాజపా పాపం ట్రబుల్స్ లో ఉంది. పవన్ కల్యాణ్ కు ఉన్న అనన్యమైన ఛరిష్మాను అడ్డు పెట్టుకుని.. తమ పార్టీ ఓటు బ్యాంకును పెంచుకోవచ్చునని ఆ పార్టీ ఇన్నాళ్లూ అనుకుంది. అయితే చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చే విషయంలో భారతీయ జనతా పార్టీ మీనమేషాలు లెక్కిస్తూ ఉండడంతో పవన్ కల్యాణ్ తన తుది నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ అనేది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పటికీ.. ఆయన తనంత తానుగా నిర్ణయం తీసుకుని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించేశారు. బిజెపి ఒప్పుకోలుతో తనకు నిమిత్తం లేదని ఆయన తేల్చేశారు.
భారతీయ జనతా పార్టీ ఇన్నాళ్లుగా, పవన్ కల్యాణ్ తమ ఉచ్చులో ఇరుక్కుని ఉన్నాడనే ఉద్దేశంతోనే ఉన్నది. పవన్ ఏం మాట్లాడినా, ఆయన తమ కూటమిలో ఉన్నారని, తాము కలిసి పోటీచేస్తామని బిజెపి నాయకులు ఇన్నాళ్లుగా మాటలు వల్లెవేస్తూ వచ్చారు. పవన్ కల్యాణ్ తన వైఖరిని స్పష్టం చేసిన తర్వాత భాజపా కీలక నాయకుల సమావేశంలో కూడా.. పవన్ మాటలపై అధిష్ఠానంతో చర్చించి ఆ తర్వాత స్పందించాలని వారు నిర్ణయించారు. ఆయన ఇంకా తమ కూటమిలో ఉన్నారు కదా అని వారే అనుకున్నారు!
కానీ తాజాగా పెడన బహిరంగసభలో పవన్ కల్యాణ్ ఆ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. ఇన్నాళ్లూ నేను ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నా కూడా, వారు కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా ఇవాళ ‘‘బయటకు వచ్చి’’ తెలుగుదేశంతో కలిశానంటే.. ఈ రెండు పార్టీలు కలవడం అనేది ఈ రాష్ట్రం బాగుండడానికి అవసరం అని తేల్చి చెప్పారు. కూటమినుంచి తాను బయటకు వచ్చానని ఆయన చెప్పడం ఇదే ప్రథమం.
ఇప్పటికైనా కమలదళానికి క్లారిటీ వస్తుందా లేదా చూడాలి. ఇంకా పవన్ కల్యాణ్ భుజాల మీద సవారీ చేస్తూ తాము తమ పార్టీ బలాన్ని పెంచుకోవాలనే వ్యూహాలు వర్కవుట్ కావని వారు తెలుసుకోవాలి. ఏపీ రాజకీయాల్లో వారి విధానం ఏమిటో కూడా తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఇలాంటి సమయంలో రాష్ట్రంలోని 175 స్థానాల్లో తాము పోటీచేస్తామని అనడం సహజం. కానీ అదేజరిగితే.. గత ఎన్నికల్లో దక్కిన ఒక్కశాతం ఓటు బ్యాంకు అయినా మళ్లీ దక్కుతుందా? లేదా, అంతకంటె తగ్గుతుందా? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పవన్ పై కమల దళానికి ఇంకా క్లారిటీ రాలేదా?
Sunday, December 22, 2024