టీటీడీ మాజీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి కోరుకున్నదే జరుగుతోంది.టీటీడీ గోశాలను గోవధ శాలగా మార్చేశారని, మూడునెలల తక్కువ వ్యవధిలోనే ఏకంగా వందకుపైగా ఆవులు అక్కడ చనిపోయాయని తాను ఏ ఆరోపణలైతేచేస్తూవ చ్చారో.. అవి అబద్ధాలు కాదని.. ఏ విచారణ చేయించినా కూడా ఎదుర్కోవడానికి తాను సిద్ధమేనని భూమన అన్నారు. ఆయన కోరుకున్నదే జరుగుతోంది. టీటీడీ భూమన మీద పోలీసు కేసు పెట్టింది. ఈ మేరకు టీటీడీ బోర్డు సభ్యుడు, బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి భూమన మీద కేసుపెట్టి విచారణ చేయాల్సిందిగా కోరారు. అయితే టీటీడీ ఉద్యోగుల్లోనూ ప్రజల్లోనూ మరో వాదన వినిపిస్తోంది. పృష్ట తాడనాత్ దంత భంగః అనే సామెత లాగా.. ఎక్కడో భూమన కరుణాకర రెడ్డి మీద కేసు పెడితే.. టీటీడీ సంస్థలో ఉద్యోగులుగా ఉంటూ భూమన తరఫు గూఢచారులుగా, కోవర్టులుగా పనిచేస్తున్న వారికి మూడినట్టేనని పలువురు విశ్లేషిస్తున్నారు.
గోశాలకు గతంలో డైరక్టరుగా పనిచేసిన హరినాధ రెడ్డిని టీటీడీ సస్పెండ్ చేయగా, అతడికి మద్దతుగా అతడు అందించిన తప్పుడు సమాచారంతో భూమన మాట్లాడుతున్నారంటూ అధికారులు గతంలో పేర్కొన్నారు. అయితే.. తనకు సమాచారం హరినాధ రెడ్డి ఇవ్వలేదు అని సమర్థించుకునే ప్రయత్నంలో భూమన షాకింగ్ వివరాలు బయటపెట్టారు. టీటీడీలో రెండు వేల మంది తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంటారని, తన నిఘానేత్రాలుగా పనిచేస్తుంటారని ఆయన అన్నారు. ఆయన చెప్పిన అంకెల్లో తేడా ఉండొచ్చు గానీ.. ఉద్యోగులు కొందరు ఆయనకు కోవర్టులుగా సహకరిస్తూ ఉండడంలో ఆశ్చర్యం లేదు.
భూమన కరుణాకరరెడ్డి గతంలో కూడా రెండు దఫాలు చైర్మన్ గా చేశారు. ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించారు. వారంతా ఇప్పుడు ఆయన గూఢచారులుగా పనిచేస్తుండే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో పోలీసు విచారణ ప్రారంభం అయిన తర్వాత.. కరుణాకర రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టుగా మాట్లాడితే కుదరదు. నీకు సమాచారం ఎలా వచ్చింది? ఫోటోలు ఎవరు ఇచ్చారు? వాటిని ప్రెస్ మీట్ లో బయటపెట్టే ముందు ఇతర మార్గాల ద్వారా ధ్రువీకరించుకున్నావా లేదా? అనే ప్రశ్నలు తప్పకుండా పోలీసుల నుంచి ఎదురవుతాయి. ఆ ప్రశ్నలకు ఆయన జవాబు చెప్పే తీరాలి. గోశాలలో ఆవుల మరణాలు అంటూ ఫోటోలు చూపించి.. అవి ఎలా వచ్చాయో చెప్పకపోతే ఆయనే ఇరుక్కుంటారు. ఈ క్రమంలో ఎవరి ద్వారా ఫోటోలు వచ్చాయో చెబితే.. ఆ ఉద్యోగులు కూడా కేసులో ఇరుక్కుంటారు.
ఈ ఫోటోల వ్యవహారంలో ‘ఫేక్’ లేనంత వరకు, ఎవరైనా భూమన కోవర్టులుగా తేలినా కూడా పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ.. ఏమాత్రం తేడా వచ్చినా.. టీటీడీ కొ లువుల్లో ఉన్న భూమన యొక్క నిఘానేత్రాల ఉద్యోగాలకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. అధికారికంగా టీటీడీ పోలీసు కేసు నమోదు చేసిన తర్వాత.. దానివలన భూమనకు కూడా చిక్కులు తప్పవు గానీ.. ఆయనకు మించి.. ఆయన కోవర్టులుగా పనిచేస్తున్న వారికి మూడుతుందని పలువురు అంటున్నారు.