మామయ్యే అలిగిన వేళ..

Monday, January 20, 2025

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన ప్రభుత్వం మీద, పరిపాలన సాగుతున్న తీరు మీద.. ఆయన మామయ్య- మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అలకపూనడం అనేది ఇవాళ కొత్త సంగతి కాదు. గతంలో కూడా పలుమార్లు అడిగారు. పలుమార్లు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. అయితే తాజా పరిణామంలో.. ఆయన ఏకంగా తన గన్ మెన్లను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేసేస్తున్నట్లుగా డీజీపీ లేఖ రాశారు. ఇలాంటి పరిపాలను తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని, నాలుగేళ్ల నుంచి మాత్రమే ఇలాంటి విచిత్రమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయని బాలినేని ప్రకటించడం చర్చనీయాంశంగా మారుతోంది.

ఆయన ఇంతగా అలగడానికి కారణం.. జిల్లాలో కలకలం రేపిన నకిలీ భూపత్రాల కేసు కారణం కావడం విశేషం. ఈ కేసులో ఇప్పటికే పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ అరెస్టులు మాజీ మంత్రి బాలినేనికి తృప్తి కలిగిస్తున్నట్టు లేదు. పోలీసులు అనధికారికంగా కొన్ని పేర్లు చెబుతున్నారని, వారిని అరెస్టు మాత్రం చేయడం లేదని బాలినేని విమర్శిస్తున్నారు.

ప్రభుత్వం పరువు తీసే.. ఈ నకిలీ పత్రాల కుంభకోణంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నా, తన పక్కనే తిరిగే వ్యక్తులు ఉన్నా కూడా విడిచిపెట్టవద్దంటూ.. బాలినేని సాక్షాత్తూ కలెక్టరు సమక్షంలోనే ఎస్పీకి విన్నవించుకున్నారు. అయినా తన విజ్ఞప్తులకు ఖాతరు లేకుండాపోయిందని, అసలు దొంగలను పోలీసులు పట్టుకోవడం లేదని ఆయనకు ఆగ్రహంగా ఉన్నట్లుంది.

వైసీపీకి చెందిన ఎంతటి పెద్దవారైనా ఈ కేసు వెనక ఉంటే అరెస్టు చేసి తీరాల్సిందేనని బాలినేని అంతగా పట్టుబట్టడం చూస్తోంటే.. పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం వారే ఈ నకిలీ పత్రాల కుంభకోణం వెనుక ఉన్నారనే అభిప్రాయం అందరికీ కలుగుతోంది. నిజం చెప్పాలంటే ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ముఠాకుమ్ములాటలు బాగా దెబ్బతీస్తున్నాయి. పార్టీలో జిల్లాలో తన ప్రాభవానికి గండిపడిందని, తన మాటకు విలువ లేకుండాపోయిందని బాలినేని చాలా కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మంత్రి వర్గం పునర్ వ్యవస్థీకరణలో పెద్దిరెడ్డి, బొత్స లాంటి వారితో సహా.. జిల్లాకు చెందిన వైరి వర్గం నాయకుడు ఆదిమూలపు సురేష్ ను కూడా కొనసాగిస్తూ తనను మాత్రం తప్పించడాన్ని ఆయన జీర్ణం చేసుకోలేకపోయారు. టీటీడీ ఛైర్మన్ గా పదవీకాలం ముగిసిన తర్వాత.. రాజకీయాలు చురుగ్గా చేస్తున్న వైవీ సుబ్బారెడ్డి తో కూడా బాలినేని కి ఎడతెగని విభేదాలున్నాయి. ఆయన ప్రస్తుత మాటలను బట్టి.. వారి వర్గాలకు చెందిన వైసీపీ నాయకులే ఈ నకిలీ భూపత్రాల కుంభకోణం వెనుక ఉన్నారా? వారిని ఇరికించడానికి జగన్ మామయ్య ఇంతగా అలిగి, పట్టుపడుతున్నారా? అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది.

మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు తమలో తాము కుమ్ములాడుకుంటూ.. ప్రభుత్వం పరువును బజారు పాల్జేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles