ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీగా ప్రస్థానం ముగించిన తర్వాత.. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఇంకా పార్టీ పరంగా అనేక అవమానాలను ఎదుర్కొన్నాను.. అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అంటూ.. మర్రి రాజశేఖర్, అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
అదే సమయంలో చిలకలూరి పేటలో తన వర్గం కార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించి.. జగన్ ద్వారా ఎన్నెన్ని అవమానాలు ఎదుర్కొన్నదీ ఆయన విశదీకరించారు. తెలుగుదేశం పార్టీలో త్వరలో చేరబోతున్నట్టుగా కూడా ప్రకటించారు. అయితే.. తెలుగుదేశంలో చేరడానికి ఆయన ఎలాంటి షరతులు విధించలేదని తెలుస్తోంది. చంద్రబాబునాయుడు ఎదుట షరతులు పెడితే వర్కవుట్ కావని తెలిసీ.. మర్రి రాజశేఖర్ కేవలం జగన్ పార్టీలో కొనసాగడం ఇష్టం లేకనే, బేషరతుగా పార్టీ మారుతున్నట్టుగా ఆయన అనుచరుల ద్వారా తెలుస్తోంది.
చిలకలూరిపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి గట్టి నాయకులతో బలంగానే ఉంది. ప్రస్తుతం అక్కడ ప్రత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతిపాటి పుల్లారావుతో.. మర్రి రాజశేఖర్ కు సుమారుగా రెండు దశాబ్దాల రాజకీయ వైరం ఉంది. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ 2004లో అప్పటి తెలుగుదేశం సిటింగ్ ఎమ్మెల్యే ప్రత్తిపాటిని ఓడించారు. 2009 ఆయన చేతిలోనే పరాజయం పాలయ్యారు. 2014లో కూడా ఈ ఇద్దరే తలపడ్డారు గానీ.. మళ్లీ ప్రత్తిపాటినే విజయం వరించింది. 2019 నుంచి మర్రి రాజశేఖర్ కు తియ్యటి మాటలు చెబుతూ ఆయనను జగన్మోహన్ రెడ్డి లూప్ లైన్ లో పెట్టారు.
ఇలాంటి పరిస్థితుల్లో.. తెలుగుదేశం పార్టీలో చేరినంత మాత్రాన చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశం లేదని మర్రి రాజశేఖర్ కు స్పష్టత ఉంది. ప్రత్తిపాటిని పక్కన పెట్టి.. తనకు ఇస్తారనే ఆలోచన ఆయనకు లేదు. అయితే.. చాలా రకాలుగా తనను మోసం చేసిన, అవమానాలకు గురిచేసిన జగన్ జట్టులో ఉండడం ఇష్టం లేకనే మర్రి ఆ పార్టీని వీడి బేషరతుగా తెలుగుదేశంలో చేరడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఆయనకు సీనియారిటీని బట్టి సముచిత గౌరవం కల్పిస్తామని మాత్రమే చంద్రబాబు ఇప్పటికి హామీ ఇచ్చినట్టు సమాచారం.
కాకపోతే.. వైసీపీని వీడడం కోసం 2029 వరకు ఉన్న తన ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేశారు మర్రి రాజశేఖర్. ఈ స్థానానికి ఉప ఎన్నిక వస్తే తెలుగుదేశం ఆయననే ఎంపిక చేస్తుందని.. తిరిగి అదే పదవిలో కూర్చోబెడుతుందని పార్టీ వర్గాల్లో ఊహాగానాలు నడుస్తున్నాయి.