అలవోకగా తిట్లు తిడుతూ రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించడంలో ప్రస్తుత రాజకీయాల్లో కేసీఆర్ ను మించిన వారు లేరు. అతి సహజమైన తెలంగాణ యాసలో.. సామెతలను, నానుడులను కూడా వాడుతూ.. ఎడాపెడా ప్రత్యర్థుల్ని తిట్టడం తన హక్కుగా, ప్రత్యేకతగా ఆయన భావిస్తారు. ఇంకా ముఖ్యంగా ఎన్నికల సీజన్ వచ్చిందంటే.. ఇలాంటి వెరైటీ తిట్ల దండకాన్ని మరింత ప్రముఖంగా వినిపిస్తుంటారు. ఆయన రకం తిట్లు ఇతరత్రా రాజకీయాల్లో సహజంగా మనకు వినిపించవు. కానీ.. ఆలోటు భర్తీచేశారు.. ఆయన కూతురు కల్వకుంట్ల కవిత. రెండుమూడుసార్లు ‘చెప్పుతో కొడతా..’, ‘చంపుతం బిడ్డా’ లాంటి పదాలతో ఆమె తన వారసత్వప్రతిభను చాటుకున్నారు. బాప్ ఏక నెంబర్ కా అయితే.. బేటీ దస్ నెంబర్ కీ అన్నట్టు మాట్లాడారు.
కల్వకుంట్ల కవిత బిజెపిలో చేరడానికి సంబంధించిన వ్యవహారం రెండు మూడు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తూ ఉంది. బిజెపిలోకి చేరాల్సిందిగా తన కూతురును ఆహ్వానించినట్టు కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. కవిత బిజెపిలో చేరడానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను ఆహ్వానించినట్టు తనకు ఖచ్చితమైన సమాచారం ఉన్నదని కూడా చెప్పారు. అర్వింద్ మాటల తర్వాత.. ఈ వివాదం రాజుకుంది.
తెరాస కార్యకర్తలు హైదరాబాదులో అర్వింద్ ఇంటిమీద దాడిచేసి విధ్వంసం సృష్టించారు. సహజంగానే ఇక్కడ కూడా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. అదేరోజున కవిత కూడా ప్రెస్ మీట్ పెట్టారు. నా గురించి మాట్లాడావంటే చెప్పుతో కొడతా అంటూ రెచ్చిపోయారు. నువ్వు ఎక్కడ పోటీచేస్తే అక్కడ పోటీచేసి.. నిన్ను ఓడిస్తా బిడ్డా అంటూ హెచ్చరించారు. చంపుతం బిడ్డా అంటూ గర్జించారు. కేసీఆర్ తప్ప.. ఈ స్థాయి విమర్శలు ఆ పార్టీ పెద్దల్లో అరుదు. కేటీఆర్ ఎన్నడూ ఈ స్థాయికి వెళ్లకుండానే తన తరహాలో ప్రత్యర్థులను విమర్శిస్తుంటారు. ఇప్పుడు కవిత మాటలు విన్నవాళ్లంతా.. తండ్రికి తగ్గ తనయ అంటూ విస్తుపోతున్నారు.
ఈ వివాదం ఇంకా ముదురుతోంది. తెరాస, బిజెపి నేతల మధ్య విమర్శల జోరు నడుస్తోంది. తాను లేని సమయంలో తన తల్లి ఉండగా ఇంటిమీద దాడిచేసి బెదిరిస్తారా? అంటూ ధర్మపురి అర్వింద్ కూడా గుస్సా అవుతున్నారు. దమ్ముంటే నన్ను ఓడించు అని సవాలు విసురుతున్నారు. 2024 ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నానని అంటున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలను కొనడానికి బిజెపి ప్రయత్నించిందనే ఆరోపణలు విచారణ పర్వంలో ఉండగా.. గులాబీ తనయకు కూడా బిజెపి ఆఫర్ వచ్చిందనే వివాదం అంతకంటె ఘాటుగా తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది.