పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా విలక్షణమైన రాజకీయ నాయకుడు. ఏ సందర్భంలో చూసినా.. ఆయనకు ప్రజల యాంగిల్ కంటే.. తన ప్రచార యాంగిల్ మాత్రమే ప్రధానంగా గుర్తుంటుంది. దానికి తోడు ఆయన కరపత్రికలు కూడా ఎలాంటి భజన చేస్తుంటాయంటే.. పూనకం తెచ్చుకుని ఊగిపోతుంటాయి. అరే.. నేను ఇంత గొప్పవాడినా.. అని ఆయనకూడా ఆశ్చర్యపోయే స్థాయిలో కరపత్రికల డబ్బావాయింపుడు కార్యక్రమం ఉంటుంది. ఈ భజనల్ని జగన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారనేది అందరికీ తెలిసిన సంగతి. జగనన్న కళ్లలో ఆనందం చూడడానికి రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉండే నాయకతమ్ముళ్లలో ఇద్దరు అరెస్టుకాగా, ముగ్గురు పరారీలో ఉన్నారు. వరద బాధిత ప్రాంతాల పరామర్శకు వెళ్లిన జగన్ వ్యవహరించిన తీరు, అందుకు కరపత్రికల బాకాలు కంపరం పుట్టించేలా ఉన్నాయి.
కేవలం వరద పరామర్శల విషయం మాత్రమే కాదు. ఏ పరామర్శల సంగతి తీసుకున్నా సరే.. అసలు జగన్మోహన్ రెడ్డి అంటేనే ప్రజలు మొత్తం పూనకం తెచ్చుకుని ఊగిపోతున్నట్టుగా ప్రచారం చేయడానికి ఆయన వందిమాగధులు సిద్ధంగా ఉంటారు. అధికారంలో ఉన్నంత కాలం.. ప్రజల్ని, పేదల్ని అంటరానివాళ్లలా చూస్తూ నగరాల్లో పరదాలు కట్టుకుని తిరిగిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు జనంలోకి పరామర్శల పేరుతో తరచూ వెళుతున్నారు. వరద ప్రాంతాల పరిశీలనకు కూడారెండోసారి వెళ్లారు.
ప్రచారం ఎలా ఉన్నదంటే.. ఆయన పరామర్శకు వెళ్లిన సంగతి, అక్కడి ప్రజలు అనుభవిస్తున్న ఎలాంటి కష్టాలని పరిశీలించారు.. వారికి ఎలాంటి సాయం అందించారు..అనేది ప్రధానం కానే కాదు. ఆయనను చూసి జనం ఎలా ఎగబడ్డారు? ఆయన పట్ల వారికి ఇంకా అంత క్రేజ్ ఎలా ఉన్నది? వారికి అంత ఎమోషన్ ఎందుకు ఉన్నది? లాంటి అంశాలే కీలకంగా వారు బాకా ఊదుకుంటున్నారు. నిజానికి జగన్ తాజాగా ప్రజల్లోకి వెళ్లి చేసిందేమీ కూడా లేదు. ఏదో ఎన్నికల ప్రచార సభలకు వెళ్లినట్టుగా చేతులు ఊపుకుంటూ, తలలు నిమురుకుంటూ గడిపారు. వరద బాధితులను కూడా ఒక వక్రమైన చిరునవ్వుతో పలకరించడం అనేది జగన్ కు మాత్రమే చేతనైన విద్య.
ఈ సందర్భంలోనే కాదు.. ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబాల్ని పరామర్శించడానికి వెళ్లే సందర్భాల్లో కూడా తాను వెళ్లే మార్గాల్లో జనాన్ని పోగేయించి.. వారితో చేతులు ఊపించుకుని.. తన పట్ల ప్రజాదరణ వెల్లువెత్తుతున్నట్టుగా చాటుకునే ఉబలాటం గతంలో కూడా కనిపించింది. ఇప్పుడు వరద బాధితుల విషయంలో కూడా అలాగే చేస్తున్నారు.