తాను ఇంట్లోంచి అడుగు బయటపెడితే.. ‘సీఎం సీఎం’ అనే నినాదాలు మాత్రమే వినిపిస్తూ ఉండాలి. తన వెంట వందలు వేల సంఖ్యలో హోరెత్తుతూ.. తనకు జైకొడుతూ జనం మందలుగా వస్తూ ఉండాలి. కనులముందు పూర్తిగా తన వందిమాగధులు మాత్రమే కనిపించాలి. అని కోరుకునే, అలాంటి వాటికి అలవాటు పడినమాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అలా కాకుండా మరొక రకమైన ప్రజాస్పందన కనిపిస్తే సహించలేరా? అనే అనుమానం ఇప్పుడు ప్రజల్లో కలుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి విపరీతమైన అసౌకర్యానికి, అసహనానికి గురవుతున్నారా? లేదా, భయపడుతున్నారా? అని జనం చర్చించుకుంటున్నారు. బుధవారం నాడు పొగాకు రైతులను పరామర్శించాలి అనే ఎజెండాతో పొదిలికి వెళ్లారు. అక్కడి ప్రజలు ప్రధానంగా మహిళలు జగన్ కు నల్ల బెలూన్లతో స్వాగతం పలికారు. జగన్ ఎటూ వారి మీద తన అనుచరులతో, పార్టీ కార్యకర్తలతో రాళ్లతోను, చెప్పులతోనూ దాడిచేయించారు. అయితే వారి నిరసనల నేపథ్యంలో ఆయన విపరీతమైన అసహనానికి గురైనట్లుగా, తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు చేరిన తర్వాత.. తన పార్టీ నాయకుల మీద చిందులు తొక్కినట్టుగా తెలుస్తోంది.
ఇలాంటి నిరసనలు ఎదురవుతాయని తెలిసి ఉంటే.. అసలు పొదిలికి వచ్చిఉండేవాడినే కాదంటూ జగన్మోహన్ రెడ్డి చిందులు తొక్కినట్టుగా సమాచారం. పార్టీ వేగులుగా పనిచేయాల్సిన వారు.. ఇలాంటి పరిస్థితిని పసిగట్టి తనను అలర్ట్ చేయలేకపోయినందుకు ఆయన కోపగించుకున్నట్టుగా తెలుస్తోంది. అలాంటి వారిని పసిగట్టి ముందుగానే అడ్డుకుని ఉండాల్సిందని ఆయన చెప్పారట.
ప్రజాస్వామ్యానికి అలవాటు పడిన ప్రజలున్న ఈ దేశంలో.. తనయొక్క, తన పార్టీ యొక్క నాయకులు, తన భార్య యజమానిగా నిర్వహిస్తున్న టీవీ ఛానెల్ ఒక వివాదానికి కారణం అయినప్పుడు.. ప్రజలు ప్రజాస్వామిక పద్ధతిలో నల్ల బెలూన్లతో తెలియజేసిన నిరసనను కూడా సహించలేకపోవడం అనేది జగన్ దౌర్బల్యానికి నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమాత్రం నిరసనల్ని కూడా సహించలేని జగన్ ఇంటికి చేరగానే పార్టీ నాయకులు, అనుచరులు అందరి మీద చిందులు తొక్కారని సమాచారం. గురువారం గుంటూరు వెళ్లి అక్కడ కూడా పొగాకు రైతుల్ని పరామర్శించాలనుకున్న పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. గురువారమే బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోయారు.
అయితే పొదిలి అనుభవం తర్వాత గుటూరులో పర్యటించడానికి జగన్ భయపడ్డారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే- అమరావతి గురించి తన ఛానెల్లో వచ్చిన దుర్మార్గపు వ్యాఖ్యలకు.. ప్రకాశం జిల్లాలోనే అంతటి తీవ్ర నిరసన వ్యక్తం అయితే.. ఇక గుంటూరులో అక్కడి ప్రజల ప్రతిస్పందన ఎలా ఉంటుందో అని ఆయన సంకోచించినట్టు తెలుస్తోంది. పొదిలి ఘటనలో.. వైసీపీ గూండాలే రాళ్లు, చెప్పులు విసిరినప్పటికీ.. జగన్ మీద దాడి జరిగినట్టుగా సాక్షి ప్రచారం చేసింది. కానీ, గుంటూరు వెళితే.. నిజంగానే చెప్పులతో దాడి జరుగుతుందని.. తాము ఆపలేకపోవచ్చునని కూడా జగన్ భయపడినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అసహనం నుంచి ఊరట పొందడానికి, భయం నుంచి దాక్కోవడానికి బెంగుళూరు పారిపోయి ఉంటారని ప్రజలు ఎద్దేవాచేస్తున్నారు.
జనం నిరసనలు జగన్‌కు అసహనమా? భయమా?
Friday, December 5, 2025
