నోరు తెరిచి ప్రశ్నించే ప్రతి ఒక్కరూ కూడా రౌడీలు అని ముద్రవేస్తూ అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతుంటారు. వాళ్లు రౌడీలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీసులు అందరూ వారి పార్టీ కోసం చేయాల్సిన గూండాలు అని పరిగణిస్తూ ప్రభుత్వం వారికి జీతాలు ఇస్తున్నదా అని అనుమానం కలుగుతోంది. అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగిన ఘర్షణలు, హత్యా ప్రయత్నం, ఉద్రిక్త వాతావరణం.. ఈ వ్యవహారాలు అన్నీ కలిసి పోలీసుల తీరు మీద ప్రజలకు అనేక అనేక సందేహాలు కలిగిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తొత్తులుగా తైనాతీలుగా వ్యవహరిస్తున్నారనే విపక్షాల ఆరోపణ- తొలినాటి నుంచి వినిపిస్తూనే ఉంది. ‘‘ఇది కేవలం ఆరోపణ మాత్రమే తప్ప పోలీసు యంత్రాంగం చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేస్తుందే తప్,ప పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తడానికి కాదు’’ అని ఆ పోలీసులు ఎన్నడూ నిరూపించుకోలేకపోయారు. ప్రతి సందర్భంలోనూ అధికార పార్టీకి కొమ్ము కాసే పోలీసుల ధోరణి మాత్రమే బయటపడింది.
తాజాగా రాప్తాడు నుంచి జాకీ పరిశ్రమ తరలిపోయే వ్యవహారానికి సంబంధించి రేగిన నిరసనలు వాటి పర్యవసానంగా ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు తీరు మరో మారు ప్రశ్నార్ధకం అవుతోంది.
ఒక ఎమ్మెల్యే లంచాలు అడిగినందువల్లనే జాకీ సంస్థ వెనక్కు వెళ్లిపోయిందని ఓ పత్రిక కథనం ప్రచురించి నిప్పు రాజేసింది. దానిని ఆధారంగా చేసుకుని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జాకీ సంస్థను వెళ్లగొట్టారంటూ తెలుగుదేశం ఆరోపణలు ప్రారంభించింది. ప్రకాష్ రెడ్డి తమ్ముడు ఒక వీడియో విడుదల చేస్తూ అందులో చంద్రబాబు నాయుడును ఎడాపెడా దూషించారు. దానికి జవాబుగా తెలుగుదేశం నాయకుడు జగ్గు అనే వ్యక్, తి వారి కుటుంబ సభ్యుల మీద నిందలు వేస్తూ, దూషిస్తూ మరొక వీడియోను రిలీజ్ చేశారు. దాని ఆధారంగా ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకు వచ్చినప్పుడు ఘర్షణలు రేగాయి. అతడే అనే భ్రమపడి అతడి తమ్ముడిని చంపడానికి తీసుకెళ్లిన వైసిపి నాయకులు తాము టార్గెట్ చేసింది అతడిని కాదు అని అర్థం అయ్యాక విడిచిపెట్టారు. స్టేషన్ ఎదుట ఇరువర్గాల వారూ కొట్టుకున్నారు. ఈ ఘర్షణలు జరుగుతున్నంత సేపు పోలీసులు తమకేమీ సంబంధం లేనట్టుగా స్టేషన్ లోనే ఉండిపోయారని వార్తలు వస్తున్నాయి.
ఒక తెలుగుదేశం నాయకుడి మెడ పట్టుకొని నొక్కుతూ ఎస్సై కెమెరాలకు చిక్కడం విశేషం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా రౌడీలు గుండాలు అక్కర్లేదని ఆ పార్టీ తరఫున ఆ పని మొత్తం పోలీసులే ఖాకీ బట్టలు వేసుకొని మరీ చేస్తుంటారని ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం నాయకుడు పీక నొక్కిన ఎస్సైను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి పోలీసు వ్యవస్థను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడం ద్వారా రాజకీయ ప్రత్యర్థుల ఉద్యమాలను, ప్రజలలో వ్యక్తం అయ్యే వ్యతిరేకతలను అణిచివేయవచ్చునని ప్రభుత్వం భావిస్తున్నదో ఏమో కానీ.. అదే తీరు వలన ప్రభుత్వం పరువు మొత్తం పోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది.