ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ ఎంపీ స్థానాలు భర్తీ కానున్నాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఏపీలో ఘన విజయం సాధించిన తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస రాజీనామాలు పోటెత్తిన సంగతి అందరికీ తెలిసిందే. ఎటూ భవిష్యత్తు లేదని క్లారిటీ వచ్చిన వైఎస్సార్ పార్టీకి రాజీనామా చేయడం మాత్రమే కాదు.. ఆ పార్టీ ద్వారా లభించిన చట్టసభల పదవులు కూడా అక్కర్లేదనుకుని త్యజించిన వారి సంఖ్య కూడా బాగానే ఉంది.
అలాంటి క్రమంలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు ముగ్గురు అటు పార్టీకి, ఇటు పదవులకు కూడా రాజీనామా చేయడం వలన మూడు స్థానాలకు ఉప ఎన్నిక జరగబోతోంది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య ఆ మూడు సీట్ల పంపకం ఎలా జరుగుతుంది.. అనే చర్చ కొన్నాళ్లుగా రాజకీ వర్గాల్లో సీరియస్ గా నడుస్తుండగా.. హఠాత్తుగా బిజెపి తమ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య పేరును ఏకపక్షంగా ప్రకటించేయడం చిత్రమైన పరిణామం.
ఈ మూడు ఎంపీ స్థానాలలో ఒక సీటును జనసేనకు తీసుకుని, పార్టీ స్థాపించిన తొలినాటి నుంచి తనకు వెన్నంటి ఉన్న సోదరుడు నాగబాబును రాజ్యసభకు పంపాలని పవన్ కల్యాణ్ తలపోస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కూడా ఆయన ఈ మేరకు కమలదళం పెద్దలు మోడీ, అమిత్ షాల నుంచి మాట తీసుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూటమికి దక్కనున్న మూడు ఎంపీ సీట్లలో రెండు తెలుగుదేశం తీసుకుంటుందని, మిగిలిన స్థానంలో నాగబాబును ఎంపీ చేస్తారని గుసగుసలు వినిపించాయి.
చంద్రబాబునాయుడు తొలినుంచి కూడా సార్వత్రిక ఎన్నికల్లో ఏ దామాషాలో అయితే సీట్లు పంచుకున్నామో అదే దామాషాలో అన్నీ పంచుకోవడం జరుగుతుందని చెబుతూ వస్తున్నారు. ఆ ప్రకారం చూసినప్పుడు.. జనసేన-బిజెపిలకు కలిపి ఒక్క స్థానం ఇచ్చేందుకు ఆయన అంగీకరించే అవకాశం ఉంది. ఆ ఒక్కటీ నాగబాబుకు దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ కు షాక్ లాగా ఈ బిజెపి నిర్ణయం వచ్చింది.
ఆర్.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేసిన నాటినుంచి సైలెంట్ గా ఉంటూ.. ఏ పార్టీలోనూ చేరకుండా చాపకింద నీరులా పనులు చక్కబెట్టుకున్నారని, బిజెపి ఇవాళ ఆయన పేరును ప్రకటించిందని అంతా అనుకుంటున్నారు. దీనివల్ల నాగబాబుకు దక్కగల అవకాశానికి గండి పడవచ్చునని అనుకుంటున్నారు. తెలుగుదేశం ఒక ఎంపీ స్థానానికి బీద మస్తాన్ రావు పేరును ఖరారుచేసింది.. మరో స్థానానికి పోటీ బీభత్సంగా ఉన్నప్పటికీ.. సాన సతీష్ ను ఎంపీక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక పోతే నాగబాబు అవకాశాలకు ప్రస్తుతం గండిపడినట్టేనా అనుకుంటున్నారు.