ప్రజా రవాణా పరంగా నగరాలలో మెట్రో రైల్ వ్యవస్థ ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నగరవాసులను ఉక్కిరి బిక్కిరి చే స్తూ ఉండే బీభత్సమైన ట్రాఫిక్ ఇబ్బందులను దిగమించేలాగా నడిచే మెట్రో రైలు వ్యవస్థ పట్ల అందరిలోనూ ఇష్టం ఉంటుంది. ప్రజలకు ఎంత గొప్ప సౌకర్యంగా ఉన్నప్పటికీ.. వ్యయంపరంగా గిట్టుబాటు అయ్యే ప్రాజెక్టులు కాకపోయినప్పటికీ ఈ మెట్రోరైలు వ్యవస్థను దేశంలోని పలు నగరాల్లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. మెట్రో రైలు వ్యవస్థలోనే ఆంధ్రప్రదేశ్ అరుదైన చరిత్ర సృష్టించబోతోంది. ఏపీలో రెండు నగరాల్లో సుమారుగా 22 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్ లను కూడా రాష్ట్రప్రభుత్వం ఆమోదించింది.
దేశంలో ఇప్పటిదాకా పలు నగరాల్లో మెట్రో రైలు వ్యవస్థ నడుస్తోంది. ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు, భువనేశ్వర్ ఇలా అనేక నగరాల్లో మెట్రో ఉంది. అయితే ఒకే రాష్ట్రంలో రెండు నగరాల్లో మెట్రో రైలు వ్యవస్థ లేదు. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు విశాఖ, ఇటు విజయవాడల్లో మెట్రో ఏర్పాటు చేయడానికి డీపీఆర్ లను రాష్ట్రప్రభుత్వం ఆమోదించింది.
విశాఖలో తొలిదశలో 46.23 కిలోమీటర్ల మేర 11,498 కోట్ల వ్యయం అంచనాతో డీపీఆర్ రూపొందించారు. విజయవాడ విషయానికి వస్తే.. రెండు దశల్లో కారిడార్ 1ఎ, కారిడార్ 1బి గా మొత్తం 38.4 కిలోమీటర్ల మేర నిర్మించాలని అనుకుంటూ ఉండగా.. మొత్తం 11,009 కోట్ల అంచనాతో డీపీఆర్ రూపొందింది.
అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రపంచమే ఇటువైపు తలెత్తి చూసే నగరంగా నిర్మించాలనే సంకల్పంతో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో.. సమాంతరంగా రాష్ట్రంలోని ఇతర నగరాలను కూడా అదేస్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పం ప్రభుత్వంలో కనిపిస్తోంది.
అందులో భాగంగానే.. విశాఖ, విజయవాడలలో మెట్రో రైలు ఏర్పాటు కాబోతోంది. మొత్తం కేంద్ర నిధులతోనే ఈ ప్రాజెక్టులను నిర్మించాలని ప్రభుత్వం తీర్మానించింది. అయితే ఎంత త్వరగా ఈ మెట్రో రైలు వ్యవస్థలు కార్యరూపంలోకి వస్తాయి.. ఆ రెండు నగరాల్లో ప్రజారవాణాను సులభతరం చేయబోతున్నాయి.. అనేది వేచిచూడాలి.