ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభం అయిన తరువాత ఉపాధి అవకాశాలు అడుగంటిపోయాయనీ.. పరిశ్రమల కల్పన అనేది ఒక మిథ్యా పదార్థంగా మారిపోయిందని.. రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న జగన్ మోహన్ రెడ్డి కనీసం ఒక్క కొత్త పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారని అనేకానేక ఆరోపణలు చాలా సందర్భాలలో విపక్షాల నుంచి మనకు వినిపిస్తూనే ఉంటాయి! ఇందులో అసత్యం ఎంత మాత్రమూ లేదు. కొత్త పరిశ్రమలు రావడం లేదు సరికదా.. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వచ్చిన పరిశ్రమలు కూడా అనేకం వెనక్కు వెళ్లడం కూడా మనం చూస్తున్నాం! తాజాగా అలాంటిదే మరొక దుర్మార్గం కూడా వెలుగులోకి వచ్చింది. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి తమ పరిశ్రమ ఏర్పాటు ఆలోచనలు విరమించుకోవడం మాత్రమే కాదు.. ఏ పొరుగు రాష్ట్రాన్ని చూసి, అభివృద్ధి ఇబ్బడి ముబ్బడిగా జరుగుతోందని మనం అసూయ పడుతుంటామో.. అదే తెలంగాణలో ఒకటికి రెండు యూనిట్లు ఏర్పాటు చేయడానికి సిద్ధం కావడం విశేషం!
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో విస్తృతంగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి నిత్యం ప్రయత్నాలు జరుగుతూనే ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, వసతుల కారణంగా అనేక పరిశ్రమలు ఇక్కడ తమ యూనిట్లను పెట్టడానికి సిద్ధపడ్డాయి. భూ కేటాయింపులు జరిగి, పరిశ్రమల స్థాపన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. చంద్రబాబు నాయుడు దిగిపోయి, ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రహణకాలం ప్రారంభం అయింది. ఏర్పాటు చేసే వారికి వెన్నెల్లో చలి ప్రారంభం అయింది.
ఏపీలో ఏర్పాటు కావలసిన హీరో మోటార్స్ సంస్థ యూనిట్ తరలిపోయింది. అనంతపురంలో ఉత్పత్తిని కూడా ప్రారంభించేసిన కియా, రాజకీయ నాయకులకు జడిసి పొరుగు రాష్ట్రాలకు తరలిపోవాలని ఆలోచన చేసింది. తాజాగా అదే అనంతపురం జిల్లా నుంచి అండర్ గార్మెంట్స్ తయారు చేసే జాకీ సంస్థ తమ యూనిట్ ను ఉపసంహరించుకోవడం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే వైఖరికి జడిసి వెనక్కి వెళ్లిన జాకీ 2019 లోనే… తమ యూనిట్ ఉపసంహరించుకుంది. స్థానిక ఎమ్మెల్యే భారీ స్థాయిలో ముడుపులు ఆశించడం వల్లనే ఇది వెనక్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. తనకు 20 కోట్ల రూపాయలు ఎన్నికలకు ఖర్చయింది గనుక పది కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే బేరం పెట్టినట్టు వార్తలు వచ్చాయి. పరిశ్రమ వస్తే స్థానిక రాజకీయ నాయకులు తమ పరిధిలో కొందరికి ఉద్యోగాలు కావాలని అడగడం చాలా సహజం. కానీ పరిశ్రమ ఏర్పాటులో సబ్ కాంట్రాక్టులు అన్నీ తమకే కావాలని కూడా ఎమ్మెల్యే డిమాండ్లు పెట్టడంతో జాకీ సంస్థ భయపడింది.
పరిశ్రమ కోసం తమకు కేటాయించిన 28 ఎకరాల స్థలాలను కూడా వారు వెనక్కు ఇచ్చేశారు. ఆ పరిశ్రమ ఏర్పాటు అయితే స్థానికంగా సుమారు 7000 మందికి ప్రత్యక్ష ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం అంచనా వేస్తే అదంతా ఇప్పుడు మంటకలిసి పోయింది. తాజా పరిణామం ఏమిటంటే.. ఈ జాకీ సంస్థ తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిసి ఆ రాష్ట్రంలో రెండు చోట్ల పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏపీ ప్రజలకు దక్కవలసిన ఉపాధి అవకాశాలు, ఇక్కడ జరగవలసిన పారిశ్రామిక అభివృద్ధి మొత్తం వైసిపి నాయకుల దందాల వల్ల, దోచుకునే బుద్ధుల వలన పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ప్రజలు దుఃఖిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ పర్యటనల తరువాత పరిశ్రమలను వెల్లువలా తీసుకొస్తున్నారని జనాంతికంగా ఒక మాట చెప్పారు. ఆయన స్విట్జర్లాండ్ దాకా వెళ్లి.. సోషల్ మీడియాలో తెలుగుదేశం మీద, హైకోర్టు న్యాయమూర్తుల మీద నీచమైన వ్యాఖ్యలు చేసిన కేసుల్లో కీలకమైన నిందితులతో అక్కడ భేటీ అయినట్లుగా ఫోటోలు వచ్చాయి గాని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన పర్యటన ఫలితంగా పరిశ్రమలు రాలేదు. తనకు మద్దతుగా ప్రత్యర్థులపై నీచమైన భాషలో విరుచుకు పడే వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి జగన్ జ్యూరీక్ దాకా వెళ్లొచ్చినట్టుగా పరిస్థితి తయారైంది. ఆల్రెడీ ఏర్పాటుకు సిద్ధమవుతున్న పరిశ్రమలు తరలిపోతూ ఉంటేనే పట్టించుకోని పాలకులు కొత్త పరిశ్రమలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని ఎలా అనుకోగలం? రాష్ట్రానికి పట్టిన ఖర్మ అది?