రాజకీయ నాయకులకు ఏ రోటికాడ ఆ పాట పాడడం అనేది వెన్నతో పెట్టిన విద్య. రేవంత్ రెడ్డి అందుకు అతీతుడు ఎంతమాత్రమూ కాదు. అందుకే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైఎస్ ని మాత్రమే కాదు.. ఆయన కూతురు షర్మిలను కూడా ఆకాశినకెత్తేశారు. పనిలో పనిగా ప్రతి కాంగ్రెస్ నాయకుడికీ రాహుల్ భజన అనేది ప్రాథమిక కర్తవ్యం గనుక.. అ పనిని కూడా పూర్తిచేశారు. వైఎస్ జయంతి సభ గనుక.. ఎంతగా ఆయన కూతురు షర్మిలను కీర్తించడానికి రేవంత్ తెగించినా కూడా.. కనీస లాజిక్ లేకుండా మాట్లాడడం గురించి ప్రజలు జాలిపడుతున్నారు. పైగా, ఏపీ-నేషనల్ పాలిటిక్స్ కు సంబంధించి.. రేవంత్ ఒక వాస్తవాన్ని భలే వెల్లడించారని వెటకారం చేస్తున్నారు.
ఇంతకూ రేవంత్ రెడ్డి చెబుతున్నది ఏంటంటే- 2029 ఎన్నికల్లో వైఎస్ షర్మిల ఏపీలో ముఖ్యమంత్రి అవుతుందిట. అంటే ఇప్పుడు 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని ఒక్క సీటులో కూడా డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెసు పార్టీ వచ్చే ఎన్నికలకెల్లా.. బీభత్సంగా బలపడిపోయి, అధికారంలోకి వచ్చేస్తుందన్నమాట. అలా షర్మిలను సీఎం చేయడానికి రేవంత్ రెడ్డి కూడా తోడ్పాటు అందిస్తారట. అంతే కాదు.. కడప ఎంపీ స్థానానికి ఈలోగా ఉప ఎన్నిక వస్తుందని, అప్పుడు తానే వచ్చి కడపలో ప్రచారం నిర్వహించి షర్మిలను ఎంపీగా గెలిపిస్తానని కూడా రేవంత్ అంటున్నారు.
ఆయన ఇక్కడితో ఆగితే బాగుండేది. పనిలో పనిగా 2029 ఎన్నికల నాటికి రాహుల్ గాంధీ కూడా దేశ ప్రధాని అవుతారని ముడిపెడుతున్నారు. ఇది ప్రజలకు ఇంకా చోద్యంగా కనిపిస్తోంది. వైఎస్ జయంతి సభలో రాహుల్ కీర్తనను రేవంత్ భలే ముడిపెట్టారని అంటున్నారు. రాహుల్ ను ప్రధానిగా చూడడం అనేది వైఎస్ కల అని, ఆ కల తీరబోతుందని రేవంత్ అంటున్నారు.
ప్రజల వెటకారం ఏమిటంటే.. ‘‘ఒక్క విషయం మాత్రం నిజం రేవంత్ గారూ.. ఏపీలో షర్మిల ముఖ్యమంత్రి అయినప్పుడు.. ఖచ్చితంగా దేశంలో రాహుల్ ప్రధాని అవుతారు’’ అని అంతా వ్యాఖ్యానిస్తున్నారు.
ఏపీ పాలిటిక్స్ : భలే వాస్తవం వెల్లడించిన రేవంత్!
Wednesday, January 22, 2025