భూబకాసురుల దందా: ఎన్ఆర్ఐపై లుక్ అవుట్ నోటీసులు!

Sunday, December 22, 2024

అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలీసు వ్యవస్థను ఎన్ని రకాలుగా వాడుతోంది? రాజకీయ ప్రత్యర్థుల మీద ఉన్నపళంగా దాడులు చేయడానికి, అర్ధరాత్రి దాటాక వారిని అరెస్టు చేయాల్సి వస్తే వందల సంఖ్యలో మోహరించడానికి, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న పోస్టులు పెట్టినాసరే.. వారిని అరెస్టు చేసి నానా హింసలు పెట్టడానికి.. ఇలాంటి పనులకు మాత్రమే వాడుతోందని ఇప్పటిదాకా అనుకుంటున్నారు. అయితే ప్రెవేటు ఆస్తులను ఆక్రమించడం, కబ్జాలు చేయడంలో వైసీపీ భూబకాసురులకు అండగా, వెన్నుదన్నుగా ఆస్తుల యజమానులను బెదిరించడానికి కిడ్నాప్ చేసి దందాలు నడిపించడానికి సాక్షాత్తూ పోలీసులే సహకరిస్తు్నారనే ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. స్వదేశీ వ్యవహారాలు మాత్రమే కాదు.. విదేశాల్లో ఉన్న తెలుగువారి పట్ల కూడా ఇలాంటి దందాలు నడిపించడంతో.. ఏపీ పోలీసుల కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయంగా వ్యాపించే ప్రమాదమూ ఎదురవుతోంది.

విజయవాడ సమీపం కానూరు వద్ద ముప్పవరపు చౌదరి అండ్ లీలారామకృష్ణ ప్రసాద్ ట్రస్టు కు చెందిన వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.  ఈ ట్రస్టు కొంత మేర కబ్జాలకు గురైఉంది. ఈ ట్రస్టు ఆస్తులను కాపాడేందుకు ట్రస్టీ కుదరవల్లి శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నారు. ఆయన అమెరికన్ పౌరసత్వం ఉన్న ఎన్ఆర్ఐ. అయితే ఆ ట్రస్టు భూములను ఖాళీ చేయాలంటూ తమను బెదిరించారని కొందరు వ్యక్తులు కొక్కిలిగడ్డ జాన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ద్వారా తమను చంపించేందుకు ప్రయత్నించారని కుదరవల్లి శ్రీనివాసరావు మీద కూడా కేసు పెట్టారు. ఎన్ఆర్ఐ శ్రీనివాసరావును కేసులో ఏ3గా చేర్చిన పోలీసులు ఆయనను హైకోర్టు వద్ద అరెస్టు చేయడానికి, హైదరాబాదులోని ఆయన కుటుంబ సభ్యులను కూడా అరెస్టు చేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు.

ఈలోగా సదరు కుదరవిల్లి శ్రీనివాసరావు దేశం దాటి వెళ్లకుండా క్రిమినల్స్ మీద ప్రయోగించే లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారని వార్తలు వస్తున్నాయి. అయితే.. అమెరికా పౌరసత్వం ఉన్న శ్రీనివాసరావు, హైదరాబాదులోని అమెరికా కాన్సులేట్ అధికార్లను కలిసి, తనను పోలీసులే కిడ్నాప్ చేయడానికి జరిగిన ప్రయత్నాలను వీడియో సాక్ష్యాల సహా వారికి చూపించి.. వారి సాయంతో అమెరికాకు వెళ్లిపోయిన తర్వాత.. ఏపీ పోలీసుల లుక్ అవుట్ నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తోంది.

ఏపీ పోలీసులు వైసీపీ వారి దందాలకు సహకరించే దిగజారుడుతనం అనే అపకీర్తి విదేశాల దాకా వ్యాపిస్తున్నదనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.  ఇప్పటికే వైసీపీ నాయకులు నియోజకవర్గాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు అంగుళం వదలకుండా కబ్జా చేసేస్తున్నారని, అదే విధంగా వివాదాల్లోఉన్న భూములను కూడా పూర్తిగా కబ్జా చేసేస్తున్నారని.. తాజాగా ప్రెవేటు వ్యక్తులకు చెందినవి ట్రస్టులకు చెందినవి కూడా కాజేయడానికి పోలీసుల దన్ను తీసుకుని మరీ చెలరేగిపోవడం మరీ ఘోరంగా ఉన్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles