టీడీపీలోకి మునిసిపాలిటీలు క్యూ కడుతున్నాయ్!

Monday, December 23, 2024
సాధారణంగా స్థానిక సంస్థల పాలకవర్గాలు అధికార పార్టీకి అనుకూలంగా మారిపోతూ ఉండడం సహజం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ద్వారా నిధులు రాబట్టుకోవడం మినహా స్థానిక సంస్థలకు వేరే మార్గం ఉండదు గనుక.. వారు సులువుగా పార్టీ మారిపోతుంటారు. ఈ క్రమంలో మాచర్ల మునిసిపాలిటీ కూడా తాజాగా తెలుగుదేశం ఖాతాలోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కోలుకోవడం కూడా కష్టం అనే అభిప్రాయం పార్టీ వర్గాలలో ఏర్పడుతున్నదనడానికి ఇది ఒక నిదర్శనంగా పలువురు భావిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక మునిసిపాలిటీలు ఇంకా తెలుగుదేశం ఖాతాలోకి మారడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్న రోజులలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలకు చెందిన వారిని స్థానిక సంస్థల ఎన్నికలలో కనీసం నామినేషన్ కూడా వేయనివ్వకుండా బెదిరించారు. పెద్ద ఎత్తున దందా సాగించారు. ఆ రకంగా మెజారిటీ స్థానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కాయి. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో స్థానిక సంస్థల పాలకవర్గాల విషయంలో పార్టీల బలాబలాలు మారుతున్నాయి. ఇటీవలే కొన్ని మునిసిపాలిటీలు తెలుగుదేశం హస్తగతం ఆయన సంగతి కూడా అందరికీ తెలుసు. ఈ క్రమంలో తాజాగా మాచర్ల అదే వరుసలో చేరింది.
పులివెందుల, పుంగనూరు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ల పాలకవర్గాలలో కూడా తెలుగుదేశం జెండా ఎగరడానికి పరిస్థితిలో అనుకూలంగా ఉన్నాయని వార్తలు వస్తున్నా యి.
మాచర్ల తాజా పరిణామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకేసారి 16 మంది కౌన్సిలర్లు అధికార పార్టీలో చేరడంతో తెలుగుదేశానికి దక్కడం అనే లాంఛనం పూర్తయింది. కొత్త కౌన్సిల్ ఏర్పాటుకు వీలుగా చైర్మన్ ఏసోబు వారం కిందటే రాజీనామా చేశారు. వైస్ చైర్మన్ పోలూరు నరసింహారావు ఆల్రెడీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం లో చేరారు. ఆ తర్వాత కౌన్సిలర్లు అందరు కలిసి నరసింహారావును చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది.
మాచర్ల కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల విధ్వంసం కేసులకు సంబంధించిన ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో నియోజకవర్గంలో హవా నడిపిస్తూ ఉండే ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసలు బతికి బట్ట కడుతుందా లేదా అనే అనుమానం స్థానికుల్లో ఉంది. తమ రాజకీయ భవిష్యత్తు నిశ్చింతగా కొనసాగాలంటే తెలుగుదేశంలో చేరడమే మేలని వైసీపీ కార్పొరేటర్లు భావించినట్లుగా తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles