సుప్రీం కోర్టు అక్షింతలు వేసినంత మాత్రాన.. ఏపీ సర్కారుకు బుద్ధొస్తుందా? అలా వచ్చేట్లయితే.. ఏపీ సర్కారు బుద్ధి ఈ నాలుగేళ్లలో నిప్పులతో కడిగినట్లుగా ఎంతో పరిశుద్ధమైపోయి ఉండాలి. కానీ అలా జరగడం లేదు కదా! ఇప్పటికీ.. తలా తోకా లేని వాదనలతో కోర్టులను ఆశ్రయించడం జరుగుతూనే ఉంది. తమ ప్రభుత్వ వ్యవహారాల గురించి కోర్టుల్లో కేసులు పడితే.. తలాతోకా లేకుండా వాదించడం జరుగుతూనే ఉంది. ప్రతి సందర్భంలోనూ కోర్టులనుంచి అక్షింతలు వేయించుకోవడం కూడా జరుగుతూ ఉంది. తాజాగా మాజీ మంత్రి నారాయణ విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి భంగపాటు తప్పలేదు.
అమరావతి రాజధాని చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో అప్పటి మంత్రి నారాయణ అక్రమాలకు పాల్పడ్డారనేది.. ప్రభుత్వం ఆరోపణ. ఆయనను అరెస్టు చేసి కేసులు పెట్టారు. అసలు అడుగు ముందుకు పడని రోడ్డు నిర్మాణం విషయంలో అక్రమాలకు పాల్పడడం ఎలా జరుగుతుందనేది నారాయణ తరఫు వాదన. మొత్తానికి ఆయనను అరెస్టు చేసిన తర్వాత.. హైకోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. కానీ ప్రభుత్వానికి తృప్తి కలగలేదు. ఆయన బెయిలుమీద బయట తిరగడాన్ని చూసి వారు సహించలేకపోయారు.
అసలే నారాయణ మృదుస్వభావిగా పేరుపడ్డ రాజకీయ నాయకుడు. దూకుడుగా రాజకీయ విమర్శలు చేసే బాపతు నాయకుడు కూడా కాదు. అయినా సరే ప్రభుత్వం ఆయన మీద కక్ష కట్టింది. కేవలం ఆయన బెయిలును రద్దు చేయాలనే డిమాండ్ తో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మొత్తానికి సుప్రీం కోర్టు ఇవాళ ఆ కేసును కొట్టేసింది. సో, నారాయణ బెయిల్ కొనసాగుతుందన్నమాట!
అయితే, ఈ దావా విచారణ సందర్భంగా సుప్రీం న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి. ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినవి. ‘‘ప్రతీకార రాజకీయాల్లోకి కోర్టులను లాగొద్దు’’ అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. జగన్మోహన్ రెడ్డి సర్కారు.. తమ రాజకీయ ప్రత్యర్థుల మీద పగబట్టినట్టుగా.. వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నదని.. అర్థం పర్థం లేకపోయినా దావాలు నడిపిస్తున్నదని.. ఈ వ్యాఖ్యలు విన్న వారికి ఎవ్వరికైనా అర్థం అవుతుంది. తెలుగుదేశం పరిపాలన సాగినంత కాలమూ.. ముఖ్యమంత్రి జగన్ సహా.. ఎంతో మంది వైసీపీ నాయకులు బెయిల్ మీద చెలామణీ అవుతూ వచ్చారు. కానీ.. ఎన్నడూ వారి బెయిల్ రద్దు కోసం పగబట్టినట్టుగా ప్రభుత్వం తరఫున ప్రత్యేక పిటిషన్లతో సుప్రీం కోర్టులో అల్లరి పెట్టలేదు. అలాంటిది.. అసలే జరగని పనుల్లో అవినీతి రంగు పులిమి, ఆ వ్యవహారంలో వచ్చిన బెయిలు గురించి కూడా.. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అనేది.. ఘోరం అని ప్రజలు అనుకుంటున్నారు. సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించినట్టుగా.. రాజకీయ కక్షసాధింపులకోసం న్యాయస్థానాలను ఒక ‘టూల్’లాగా వాడుతున్నట్టుగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.