వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఏదో దేశాన్ని ఉద్ధరించేస్తున్న స్థాయిలో కబుర్లు చెప్పి.. ఉద్యోగాల కల్పన అంటూ బూటకపు మాటలు చెప్పి.. వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు వెనుక స్థూలంగా ప్రకటించే లక్ష్యం ఎలా ఉన్నప్పటికీ.. ఆచరణలో అతిపెద్ద హిడెన్ ఎజెండా ఉన్నదని, రాజకీయ ప్రయోజనాల కోసం క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటితోనూ టచ్ లో ఉండే ఈ వాలంటీర్ల వ్యవస్థను అడ్డగోలుగా వాడుకోడానికే చూస్తున్నారని తొలినుంచి విమర్శలు ఉన్నాయి. ఈ వాలంటీర్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం జీతం బత్తెం లేని కూలీల్లాగా వాడుకోవడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగానే.. వాలంటీర్ల ప్రయోగంతో తాము ఆశించే వక్రప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి వైసీపీ దిగజారుతోంది.
ఏపీ సర్కారు ఇప్పుడు హఠాత్తుగా ‘ఎంప్లాయిమెంట్ సర్వే’ ప్రారంభించింది.
ఈ సర్వే ద్వారా.. ఇంటింటికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటాం అని ప్రభుత్వం అంటోంది. కానీ.. వాలంటీర్లు వెళ్లి.. ఏయే ఇంట్లో ఎందరు పట్టభద్రులు ఉన్నారు.ఏం చేస్తున్నారు? ఏయే ఊళ్లలో ఉన్నారు. లాంటి వివరాలన్నీ నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం వారందరికీ ఉద్యోగాలు తక్షణం ఇచ్చేయబోతున్నది అనే భ్రమ కల్పిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తానంటూ ఒక వంచనతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల పట్టభద్ర నిరుద్యోగ యువతరంలో అసహ్యం పెరగకుండా.. ఉద్యోగాల పరంగా ఏదో జరుగుతోంది అనే భ్రమ కల్పించడానికి ఈ వివరాలు అడుగుతున్నారని అనుకోవచ్చు. అయితే.. వాలంటీర్లు అడుగుతున్న మరికొన్ని వివరాలే అనుమానాలు పుట్టిస్తున్నాయి.
‘మీ ఇంట్లోని పట్టభద్రులు పట్టభద్ర ఓటరుగా నమోదు చేయించుకున్నారా? లేదా? వారికి ఏ రాజకీయ పార్టీ ఇష్టం?’లాంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఇవన్నీ పట్టభద్ర ఎన్నికల్లో పార్టీకి మేలు చేసేందుకే అనేది స్పష్టం. వాలంటీర్లను అడ్డగోలుగా తమ పార్టీ కార్యకర్తల్లాగా వాడుకోవడం, రాజకీయ ప్రయోజనాలకి వాడడం ఇవాళ్టి సంగతి కాదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఈ వ్యవస్థను ప్రభుత్వం ఎంతగా దుర్వినియోగం చేసిందో అందరికీ తెలుసు. ఆ పర్వంలో ఇది బరితెగింపు రాజకీయం అనుకోవాలి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుద్ధిని గమనించిన ప్రజలు మాత్రం.. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే దాకా ఆగి.. వాలంటీర్లను రాజకీయ పనులకు అడ్డగోలుగా వాడుకోవడం అప్పుడు ప్రారంభిస్తారని అంచనావేశారు. అయితే.. వైసీపీ నాయకులు అంతదాకా ఆగేలా కనిపించడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే వారి అసలు బుద్ధులను బయటపెడుతున్నారు. వాలంటీర్లు అనే ముసుగులో రాష్ట్రమంతా చాపకింద నీరులా పనిచేస్తున్న వారందరూ కూడా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొత్తులే అని విశదం అవుతోంది. మరి ఈ అరాచక వ్యవస్థను అరికట్టడానికి ఎన్నికల సంఘం పూనుకుంటుందో.. కళ్లున్న కబోది చందంగా ప్రేక్షకపాత్ర వహిస్తుందో చూడాలి.
ఛీఛీ.. అప్పటిదాకా ఆగలేరా?
Thursday, November 14, 2024