ఎన్నారైలు, విదేశాలలో స్థిరపడిన తెలుగువారు.. వారి జీవితం స్థితిగతులు, వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ వాస్తవంలో ఎన్నారైలు కూడా ఈ దేశానికి సహజ సంపద లాంటి వాళ్లు. విదేశాల్లో బాగా ఆర్జించిన వందల వేల మంది ఎన్నారైలు ఆ సొమ్ముతో స్వదేశంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వందల వేల కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు వారి సొంత సొమ్ముతో జరుగుతూ ఉండడం గమనించాల్సిన సంగతి. అయితే ఇప్పుడు గుంటూరు దుర్ఘటన నేపథ్యంలో ఎన్నారై శ్రీనివాస్ మీద కేసులు, అరెస్టు తదితర నేపథ్యంలో.. వారు స్వదేశంలో సేవా కార్యక్రమాలు చేయాలన్నా కూడా జడుసుకునే పరిస్జితి ఏర్పడుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెుల్యే వసంతకృష్ణప్రసాద్ ఎన్నారైలను భయపడితే ఎలా? అని సొంత పార్టీ ప్రభుత్వాన్నే విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ విషయం మరోసారి చర్చనీయాంశం అవుతోంది.
ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాస్ ఎన్నారైగా ఉంటూ.. తమ ఫౌండేషన్ ద్వారా అనేక సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఆయన రాజకీయ వేదిక మీదికి వచ్చారనే ఉద్దేశంతో.. శ్రీనివాస్ పై ఉన్నవీ లేనివీ కల్పించి ప్రచారం చేస్తున్నారని వసంత కృష్ణప్రసాద్ ఆవేదన వెలిబుచుతున్నారు. పెద్దఎత్తున ప్రజలకు సేవ చేయాలని అనుకున్నందుకు ఆయనకు కష్టాలు వచ్చాయని అన్నారు.
ఇలాంటి వ్యక్తులపై విమర్శలు చేస్తూ, కేసులు పెట్టి భయపెడితే..ముందుముందు ఎన్నారైలు స్వదేశంలో నలుగురికి మంచి చేయాలన్నా కూడా వెనుకాడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే విదేశాల్లో ఎంత సంపాదించినా సరే.. సేవ చేయాల్సి వచ్చినా, పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినా ఎన్నారైలు స్వదేశాన్ని, సొంత ప్రాంతాన్నే ఎంచుకుంటూ ఉంటారు. ఇక్కడ స్కూళ్లు, ఆలయాలు బాగు చేయడం కోసం వేల కోట్ల రూపాయల మొత్తం ఎన్నారైల విరాళాల సొమ్ము వెచ్చించడం జరుగుతూనే ఉంటుంది. అనేక వందల స్కూళ్ల డిజిటలైజేషన్ ఎన్నారైల విరాళాలతోనే జరిగింది. సొంతంగా ఆలయాలు కట్టించిన వారు అనేకులు.
అలాగే ఇక్కడ పరిశ్రమలు, వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెట్టడం, పదుగురికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా అనేక మంది పనిచేస్తున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఎన్నారైల పెట్టుబడులు రకరకాల కారణాలతో ఆగిపోయాయి. ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే వాళ్లంతా వెనక్కు తగ్గారు, వెనక్కు తీసేసుకున్నారు. ఎన్నారై పెట్టుబడులకు తద్వారా ప్రభుత్వ ఆదాయానికి చెక్ పెట్టిన సర్కారు.. ఎన్నారైల సేవా కార్యక్రమాలకు కూడా చెక్ పెట్టేలా వారి గురించి విమర్శలు అరెస్టులు చేస్తోంది. ఈ దుర్మార్గమైన వైఖరిని సొంత పార్టీ ఎమ్మెల్యేనే విమర్శించడం గమనార్హం.
ఎన్నారైలు.. సాయంచేయాలన్నా జడుసుకునే దుస్థితి!
Wednesday, November 13, 2024