లేళ్ల కోసం రెడీ అవుతున్న మరో సీఐడీ కేసు!

Saturday, January 18, 2025

ఇవాళ్టి రోజుల్లో రాజకీయ నాయకులు తమ అనుచరుల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పుట్టలో ఏ పాముున్నదో తెలియదన్న సామెత చందంగా ఏ అనుచరుడి వలన ఎలాంటి ముప్పు ముంచుకు వస్తుందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. నాయకుల అండ చూసుకుని.. అనుచరులు చెలరేగి నేరాలకు పాల్పడితే.. దొరికిపోయినప్పుడు మచ్చ మాత్రం నాయకులకు తప్పదు.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి కేసులో వీడియో ఫుటేజీల్లో దొరికిపోయిన వారు అసలు తమకు తెలియనే తెలియదంటూ బుకాయించినట్టుగా ప్రతి సందర్భంలోనూ బుకాయింపులు కుదరకపోవచ్చు. అలాంటి నేపథ్యంలో అనునచరులు పాల్పడిన దాదాపు 15 కోట్ల రూపాయల మోసం వ్యవహారంలో వారికి అండదండగా నిలిచిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాత్ర, వాటా ఎంత ఉన్నదో తెలియదు గానీ.. ఇప్పుడు ఆయన చుట్టూ ఈ మోసపూరిత నేరానికి సంబంధించి మరో సీఐడీ కేసు ముసురుకునే ప్రమాదం కనిపిస్తోంది.

చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు వారి పార్టీ కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహిస్తున్నట్టుగానే.. జనసేన పార్టీ కూడా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో తాజాగా ఎమ్మెల్యే కొణతల రామక్రిష్ణ కార్యాలయానికి వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించారు. అందులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అండతో, ఆయన అనుచరులు పాల్పడిన ఒక తదుర్మార్గమైన నేరం వెలుగులోకి వచ్చింది.

బ్రిటన్ దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తాం అని ఆశచూపించి ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి, నకిలీ వీసాలతో ఒక కన్సల్టెన్సీ మోసం చేసినట్లుగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మొత్తం 54 మంది బాధితులు 14 కోట్ల రూపాయల మేర నష్టపోయినట్టుగా లెక్కతేలుతోంది. నిరుద్యోగ యువతను మోసం చేసి విష్ణు కన్సల్టెన్సీ పేరుతో సూరాబత్తుని కృష్ణచైతన్య, లక్ష్మీశెట్టి జయరాం లు ఈ నేరానికి పాల్పడినట్టు బాధితులు జనవాణిలో మొర పెట్టుకున్నారు.

గత ప్రభుత్వం హయాంలోనే బాధితులు అనేక పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగారు గానీ వారి గోడు పట్టించుకున్న వారు లేరు. నిందితులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి సన్నిహితులు, వారికి అప్పటి సకల శాఖల మంత్రి సజ్జల రామక్రిష్ణారెడ్డితో కూడా దగ్గరి సత్సంబంధాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. మరి అంత బలమైన వారిపై కేసులెలా నమోదు అవుతాయి. అందుకే ఇప్పుడు జనవాణిలో వారి గోడు వెళ్లబోసుకున్నారు.

నేరం గురించి తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కొణతల రామక్రిష్ణ, హోం మంత్రి వంగలపూడి అనితతో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. సీఐడీతో విచారణ జరిపిపంచి వాస్తవాలు వెలుగులోకి తేవాలన్నారు.  అనిత కూడా పాజిటివ్ గా స్పందించినట్టు తెలుస్తోంది. మొత్తానికి అనుచరుల మోసానికి దోపిడీకి అండగా ఉన్నందుకు లేళ్ల అప్పిరెడ్డి త్వరలోనే మరో సీఐడీ కేసు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన కేసు- పోలీసు శాఖ నుంచి సీఐడీకి మారిన సంగతి పాఠకులకు తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles