మంచి వాడికోపం వినాశనానికి దారితీస్తుందని అంటారు పెద్దలు. నెల్లూరు జిల్లా వాసులకు ఇవాళ ఆ సంగతి.. స్పష్టంగా స్వానుభవంలోకి వచ్చింది. నెల్లూరు జిల్లాలోనే ప్రతి ఏటా కోట్లాది రూపాయల సొంత డబ్బుతో అనేకానేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలందరికీ మంచి చేయాలనే తపనతో ఉండే పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి. సంపాదనకోసం కాకుండా కేవలం ప్రజాసేవ కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అని నెల్లూరు జిల్లాలో పార్టీలతో నిమిత్తం లేకుండా.. ఎవరిని అడిగినా చెబుతారు. అలాంటి మంచి వ్యక్తికి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆవేదన కలిగించారు. కోపం తెప్పించారు. మనస్తాపానికి గురిచేశారు.
ఆయన ఆ బాధతో ఎలాంటి తప్పు చేయకపోయినా సరే.. తనను నిందిస్తున్నారు గనుక.. తాను వ్యాపారాలనే మానివేస్తున్నానని ప్రకటించేశారు. వేమిరెడ్డి సహృదయుడు గనుక.. వ్యాపారాలు మానేసినా సరే.. వీపీఆర్ ట్రస్టు తరఫున సేవా కార్యక్రమాలు మాత్రం యథావిధిగా ఎప్పటికీ కొనసాగుతాయని, వాటిని మరింతగా విస్తరించబోతున్నానని ప్రకటించారు.
ఇంతకూ ఇది ఎలా జరిగిందంటే.. క్వార్ట్జ్ అక్రమ మైనింగులో అరెస్టు అయి రిమాండులో ఉన్న కాకాణి గోవర్దన రెడ్డిని ములాఖత్ లో పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గురువారం జిల్లాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరాయి జనాలను తోలించకుండా.. పోలీసులు అనేక ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో పోలీసుల మీద దుమ్మెత్తిపోయడానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి రెచ్చిపోయారు. జగనన్న పరామర్శ యాత్ర ఆర్భాటంగా చేసి తీరుతాం.. జనం వేల సంఖ్యలో వెల్లువలా వస్తారు.. ఏం చేస్తారో చేసుకోండి అంటూ రెచ్చిపోయారు.
పనిలో పనిగా క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ లో తాను కూడా సహనిందితుడు అయిన అనిల్ కుమార యాదవ్.. తమ దందాలను సమర్థించుకుంటూ ఇతరుల మీద నిందలు వేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు కూడా క్వార్ట్జ్ దందాలు సాగుతున్నాయంటూ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డిని తప్పు బట్టారు. ఆయన అక్రమాలు చేస్తున్నట్టుగా ఆరోపణలు చేశారు.
వేమిరెడ్డి ప్రభాకర రెడ్డికి కోపం వచ్చింది. రూపాయి అవినీతి చేయకుండా తాను వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఇలాంటి ఆరోపణలు చేయడాన్ని ఆయన సహించలేకపోయారు. తనకున్న రెండు కంపెనీల పేరుమీద క్వార్ట్జ్ మైనింగ్ వ్యాపారం ఇక చేయనని ప్రెస్ మీట్ పెట్టి పలకరించారు. ఎవరైనా ముందుకు వస్తే.. ఆ కంపెనీలను అప్పజెప్పేస్తానని వెల్లడించారు. తన సొంత డబ్బులు కోట్లాది రూపాయలతో సేవా కార్యక్రమాలు చేస్తోంటే.. నన్నే అవినీతిపరుడిగా చిత్రీకరిస్తారా అంటూ ఆగ్రహించారు. వెయ్యిమందికి ఉపాధి కల్పిస్తున్నానని కూడా అన్నారు. వైసీపీ నాయకుల వాచాలత్వం దుర్మార్గం వల్ల ఒక మంచి వ్యాపారాలు మానేయడం చాలా మందికి నష్టం అని ప్రజలు అంటున్నారు.
కాకాణి గోవర్దనరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు కలిసి సాగించిన క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల దందాలో ప్రతినెలా జగన్ కు కూడా 20 కోట్ల రూపాయల వంతున వాటాలు ముట్టేవని వార్తలు వచ్చాయి. మరి అంత భాగస్వామ్యం ఉన్నది గనుకనే.. కాకాణిని పరామర్శించడానికి అంత శ్రద్ధగా వెళుతున్నారని అంతా అంటున్నారు.
