కాగ్ సాక్షిగా ‘అప్పు’డే కొంప ముంచేస్తున్నారు!

Thursday, September 19, 2024

అప్పు పుడితే తప్ప రోజు గడవని పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నడో చేరుకుంది. కానీ లెక్కలు కట్టి, ఒక ఏడాదికి తమకు ఎన్ని కోట్ల రూపాయల అప్పులు అవసరం అవుతాయో బడ్జెట్లో ప్రకటించిన తర్వాత ఆ మొత్తం కంటే ఎక్కువ అప్పులను కేవలం 6 నెలల్లోనే తీసుకోవడం, ఖర్చు చేయడం అనేది అత్యంత ప్రమాదకరమైన పరిణామం. ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోవడం వలన రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, నిపుణులకు కూడా అర్థం కావడం లేదు. దేశం మొత్తం మీద అప్పులు పుట్టించడంలో నెంబర్ వన్ స్థానంలో వెలుగొందుతున్న ఆంధ్రప్రదేశ్, ఈ వ్యవహారాలను గమనిస్తున్న కాగ్‌కు సైతం భయం పుట్టిస్తోంది. కేవలం బడ్జెట్లో ప్రతిపాదించిన వార్షిక అంచనా అప్పుల విషయంలోనే పరిమితిని ఆరు నెలల్లోనే దాటేసిన ప్రభుత్వం, ఇంకా కార్పొరేషన్లు ఇతర సంస్థల రూపేణా సేకరిస్తున్న వేల కోట్ల రూపాయల అప్పులు ఎన్ని ఉన్నాయో లెక్క తెలియదు. ఇంత దారుణమైన రుణ వాతావరణం మరెక్కడా ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి సుమారుగా 48 వేల కోట్ల రూపాయల అప్పులు అవసరం ఉంటాయని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. తొలి ఆరు నెలలు అంటే సెప్టెంబర్ నెలాఖరుకే.. చేసిన అప్పులు 49వేల కోట్లు దాటిపోయినట్టుగా.. రుణ సదుపాయాలను రాష్ట్రం వినియోగించుకున్నట్లుగా కాగ్ లెక్కలు తేల్చుతున్నాయి. 

ఇంత ఘోరంగా ఆరు నెలల్లోనే అప్పులు చేసినది బీహార్ తప్ప మరొక రాష్ట్రం ఏదీ లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బీహార్ తో పోటీపడి ఆ స్థాయికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఈ పోకడ కనిపిస్తుంది. పొరుగు రాష్ట్రం తమిళనాడు పరిస్థితిని గమనిస్తే తమకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంచుమించు 96 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రతిపాదించిన తమిళనాడు ప్రభుత్వం ఈ ఆరు నెలల కాలంలో కేవలం 18 వేల కోట్లు మాత్రమే అప్పు చేసింది. ఇదంతా చూసి, ఏపీ సర్కారు రాష్ట్రాన్ని ప్రజలను అప్పులలో ముంచేస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయంటే.. నిజమే కదా అనే అభిప్రాయం పలువురిలో కలుగుతుంది!

జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఆదాయ వనరులు పెంచుకునే నిర్మాణాత్మకమైన మార్గాలు లేకుండా పోయాయి. కేవలం ధరలు పెంచిన మద్యం అమ్మకాల రూపేణా తప్ప వేరే లాభాలు లేవు. గత ప్రభుత్వంతో పోలిస్తే హద్దు అదుపు లేకుండా ఎడాపెడా దోచుకుంటున్న ఇసుక తీరువాల రూపేణా కొంత మొత్తాలు వస్తున్నాయి. అవి మినహా ప్రభుత్వం కొత్తగా ఏర్పరిచిన ఆదాయం మార్గాలు సున్నా. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాలేదు. తద్వారా రాగల ఆదాయం ఏది కొత్తగా ఏర్పడలేదు. ఇలాంటి నేపథ్యంలో కేవలం అప్పులు అప్పులు అప్పులు అనే ఒకే ఒక రుణమంత్ర జపం మీద మాత్రమే ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. అయితే ఈ రుణాలు కూడా తలకు మించిన భారంగా తయారవుతున్నాయి. ఆరు నెలల వ్యవధిలోని ఏడాదికి మించిన అప్పులు చేసేయడం అంటే మిగిలిన ఆరు నెలలు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారు? అనేది అనుమానాస్పదంగా తయారవుతుంది. కాగ్ తమ నెలవారీ నివేదికలలో వెల్లడించిన ఈ వివరాలు చూసిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం మార్గాలను అన్వేషిస్తుందో వేచి చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles