ఆంధ్రావాచ్ డాట్ కామ్ అంచనా వేసినట్టే జరిగింది. శుక్రవారం సాయంత్రంలోగా లిక్కర్ స్కామ్ లో కీలక నిందితులు ఇద్దరినీ అరెస్టు చేయడం జరుగుతుందని, సుప్రీం కోర్టు తీర్పు వెలువడినప్పుడే, ఆంధ్రావాచ్ డాట్ కామ్ అంచనా వేసింది. ‘లిక్కర్ స్కామ్ : సాయంత్రంలోగా ఆ ఇద్దరి అరెస్టు!’ అనే శీర్షికతో కథనాన్ని అందించింది. అనుకున్నట్టుగానే.. శుక్రవారం నాడు మూడోరోజు విచారణ పర్వం ముగిసిన తర్వాత జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి లను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. 16వ తేదీ దాకా తదుపరి చర్యలు వద్దు అంటూ కట్టడి చేసిన సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పులో వారి బెయిల్ పిటిషన్ లను తిరస్కరించిన తర్వాత.. సిట్ పోలీసులు ఇక ఆలస్యం చేయలేదు. మూడు రోజుల పాటు విచారణలో ఒక్క విషయం కూడా వెల్లడించకుండా.. అన్నింటికీ డొంకతిరుగుడు జవాబులు చెబుతున్న ఆ ఇద్దరినీ సాయంత్రం అరెస్టు చేశారు.
మూడున్నర వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే జరిగినట్టుగా సిట్ పోలీసులు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. జగన్ ఆదేశాల మేరకే, పార్టీకి బాగా ఫండ్ రావడం కోసమే కొత్త లిక్కర్ పాలసీని రూపొందించామని కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పినట్టుగా రిమాండు రిపోర్టులో కూడా పేర్కొన్నారు. అయితే.. వసూలు చేసిన సొమ్ము మొత్తాన్ని జగన్ కు చేరవేయడం అనేది.. ముగ్గురిద్వారానే జరిగేది అనేది పోలీసులు తేల్చిన సంగతి. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయరెడ్డిలతో పాటు భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఆ పాత్ర నిర్వహించేవారు. డబ్బు వసూళ్లలో జగన్ కోటరీలోని ఇద్దరూ కీలకం కాగా.. ఆ డబ్బును రూపాలుమార్చడం.. వివిధ డొల్ల కంపెనీల్లోకి పెట్టుబడులుగా పంపడం, నల్లధనాన్ని తెల్లబరచడం వంటి పనులు గోవిందప్ప బాలాజీ తెలివితేటలు అని తేల్చారు. అయితే ఈ ముగ్గురి పేర్లు నిందితుల జాబితాలోకి వచ్చిన తర్వాత వారు పరారయ్యారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో నడిపిన బెయిల్ పిటిషన్లు తేలలేదు.
ఇదిలా నడుస్తుండగానే.. పరారీలోఉన్న గోవిందప్ప బాలాజీని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపారు. మిగిలిన ఇద్దరి విషయంలో సుప్రీం కోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. వారి ముందస్తు బెయిల్ పిటిషనుపై 16న తుదితీర్పు వెలువడే వరకు మాత్రమే ఆ రక్షణ. విచారణకు హాజరైతే మాత్రమే ఆ రక్షణ. గతిలేని పరిస్థితుల్లో బుధవారం నాడు వారు సిట్ ఎదుటకు వచ్చారు. బుధ, గురువారాల్లో విచారణ జరిగింది. శుక్రవారం కూడా విచారణకు వచ్చారు. అదే రోజున వారు సిట్ ఎదుట విచారణలో ఉన్న సమయంలోనే సుప్రీం తీర్పు కూడా వచ్చింది. పోలీసులు విచారణ పర్వం ముగియగానే అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. వారి ద్వారా అసలు నిజాలను, అంతిమ లబ్ధిదారు వివరాలను ఎలా రాబడతారో చూడాలి.
