ప్రత్యేకహోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవని. విభజన తర్వాత.. ప్రధాన ఆదాయ వనరులను కోల్పోయి అనాథలా ఏర్పడిన రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనేది ఎంతో కీలకం అవుతుందని అంతా అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కొంత గౌరవప్రదంగా నిలదొక్కుకోవడానికి కారణమవుతుందని అనుకున్నారు. విభజన చర్చ సమయంలో పార్లమెంటులో ప్రత్యేక హోదా ప్రస్తావన వచ్చినప్పుడు.. అయిదేళ్ల పాటు ఇస్తే ఎలా సరిపోతుంది.. పదేళ్లు ఇవ్వాలని గళమెత్తిన పార్టీ బిజెపి. ఎన్నికల ప్రచారంలో పదేళ్ల ప్రత్యేకహోదాతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తామని మాట ఇచ్చిన నేత మోడీ. కానీ.. అధికారంలోకి వచ్చాక అంతా కలిసి ప్రత్యేకహోదా డిమాండ్ ను తొక్కేశారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటూ ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న సమయంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ కొత్త డ్రామా నడిపించింది. ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేకుండా.. ఎంపీలతో పదవులకు రాజీనామాలు చేయించింది. తామేదో హోదాకోసం పెద్ద త్యాగాలు చేశాం అని చెప్పుకుంది. 25 మంది ఎంపీలను గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి హోదా సాధించుకువస్తాం అని బీరాలు పలికారు. ఇప్పుడు ఆ పార్టీకి 25 మంది ఎంపీలు ఉన్నారు. కానీ హోదా విషయంలో ఏం చేస్తోంది? వినతి పత్రాలు ఇవ్వడం తప్ప సాదించేది శూన్యం.
ఇలాంటి నేపథ్యంలో తాజాగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో జరిగిన అఖిలపక్ష సమావేశం సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ.. ప్రత్యేకహోదా డిమాండ్ ను నిలువును పాతిపెట్టేశారు. మళ్లీ మళ్లీ అడిగే అవకాశం కూడా లేకుండా ఆ డిమాండ్ లో ఉండే విలువను చంపేశారు.
ఇంతకూ ఏం జరిగిందంటే.. ఈ అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవరించి అందులో ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. అక్కడికేదో తమ డిమాండ్ ద్వారా రాష్ట్రానికి మేలు చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఇప్పటిదాకా ‘ప్రత్యేకహోదా హామీ చట్టంలో లేదు’ అనే అంశంతో రాష్ట్రాన్ని వంచించడానికి కేంద్రం ప్రయత్నిస్తూ వస్తోంది. అయితే.. పార్లమెంటులో సాక్షాత్తూ చర్చలో భాగంగా ప్రధాని పదేళ్ల పాటు ప్రత్యేకహోదా హామీ ఇచ్చిన తర్వాతనే బిల్లు ఆమోదం పొంది చట్టరూపం దాల్చిందని, అందువల్ల దానికి చట్టబద్ధత ఉన్నదని, లేకపోతే అసలు పార్లమెంటు అనే వ్యవస్థకే విలువలేదని హోదా డిమాండ్ చేసేవారు వాదిస్తున్నారు.
కేంద్రం చెబుతున్న కుంటిసాకులకు అనుకూలంగా వైసీపీ ఎంపీ మాటలు ఉన్నాయి. చట్టంలో లేదు గనుక ఇవ్వక్కర్లేదు అని ఒప్పుకుంటున్నట్టుగా ఉన్నాయి. చట్టాన్ని సవరించి.. హోదాను అందులో చేర్చండి అని అడగడమే ఆత్మహత్యాసదృశం. అసలే హోదా ఇవ్వకూడదని మొండిపట్టుతో కేంద్రం వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. మార్గాని భరత్ అడిగారని విభజన చట్టాన్ని సవరించే సాహసానికి కేంద్రం పూనుకుంటుందనుకోవడం భ్రమ. చట్టం సవరించేదాకా మీరు హోదా ఇవ్వక్కర్లేదు అని వారికి స్వయంగా వైసీపీ ఎంపీలే అనుమతి ఇచ్చేసినట్టుగా ఈ పరిణామం తయారైంది. దాంతో ప్రత్యేకహోదా డిమాండ్ ను వైసీపీ ప్రబుద్ధులు చేజేతులా పాతిపెట్టేసినట్టు అయింది.
హోదా డిమాండ్ ను నిలువునా పాతేసిన వైసీపీ!
Sunday, January 19, 2025