అమరావతి రాజధాని నగరానికి అదనపు హంగులు జోడించడానికి మరో 44 వేల ఎకరాలను కూడా సమీకరించి.. విరాట్ రూపంలోకి రాజధానిని సిద్ధం చేయాలని చంద్రబాబునాయుడు ఒకవైపు సంకల్పిస్తున్నారు. ఇప్పుడున్న 54 వేల ఎకరాల భూముల్లో భారీ ప్రాజెక్టులు నిర్మాణాలు అన్నీ చోటు చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అమరావతి కోసం ఒక ప్రత్యేకమైన ఎయిర్ పోర్టు, ఒక స్పోర్ట్స్ సిటీ తదితర ఇంకా అనేక హంగులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. వీటన్నింటికోసం భూమిసమీకరణ కొత్తగా జరగాలనేది ప్లాన్. అయితే.. వైఎస్సార్ సీపీ ఇలాంటి ఆలోచన పట్ల కుటిల విమర్శలు చేయడంలో వింతేం లేదు. కానీ.. సీనియర్ నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా.. ఈ విషయంలో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
కొత్తగా 44 వేల ఎకరాలు అవసరం లేదని.. చంద్రబాబు పాతతరహాలో కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్నారని ఆయన అంటున్నారు. ఇందులో కార్పొరేట్ల ప్రస్తావన ఎక్కడఉన్నదో అర్థం కావడం లేదు. రాజధాని స్థాయి భారీ నగరం ఏర్పాటు అవుతున్నప్పుడు.. దానికి తగ్గట్టుగా హంగులుండాలని ఆలోచించడం తప్పెలా అవుతుంది అని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్పోర్ట్స్ సిటీ, ఎయిర్ పోర్టు లకే ఇంచుమించుగా 6-7 వేల ఎకరాల భూముల అవసరం ఉన్నదని వాదిస్తున్నారు. వడ్డే వంటి సీనియర్లు.. ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నట్టుగా.. జగన్ లాగా మాట్లాడడం సంకుచితత్వం అవుతుందని విమర్శిస్తున్నారు.
ప్రజలకు కావాల్సినది మౌలికవసతులు తప్ప మెట్రో రైలు కాదు అని వడ్డే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
ప్రజల వాదన ఎలా ఉన్నదంటే.. ఈ రాజధానిలో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైతే నిందించాలి. అంతే తప్ప.. పేదలకు మెట్రో రైలు అవసరం లేదు అని చెప్పడానికి వడ్డే ఎవరు? పేదలు జీవితాంతం కాలినడకన మాత్రమే తిరుగుతూ ఉండాలని ఆయన కోరుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలుగుదేశం పార్టీలోనే సీనియర్ నాయకుడు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రధానంగా రైతు నాయకుడు అయిన వడ్డే.. పంటపొలాలను రాజధానిగా మార్చేస్తున్నందుకు మనస్తాపానికి గురయ్యారంటే అర్థం ఉంది. కానీ.. అనాథలాగా ఏర్పడిన రాష్ట్రానికి ఒక గౌరవప్రదమైన రాజధాని కోసం రైతులందరూ స్వచ్ఛందంగానే పూలింగ్ ఇచ్చిన భూములే అవి అని ఆయన లాంటి వారు అర్థం చేసుకోవాలి. ఆయన ఇప్పుడు అమరావతి నగర నిర్మాణం వేగంగా జరగబోతుండడం చూసి ఓర్వలేక ఇలాంటి పసలేని విమర్శలు చేస్తున్నారని, ఆచరణాత్మకం కాని నీతులు చెబుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.