‘అమరావతి ఆయువుపట్టు’ విజయదశమినాడే ప్రారంభం!

Thursday, December 4, 2025

అమరావతి నగరంలో కీలకమైన ప్రభుత్వ భవనాల నిర్మాణాలను గరిష్టంగా మూడేళ్ల వ్యవధిలోగా పూర్తిచేస్తామని డెడ్‌లైన్ ప్రకటించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం లక్ష్యం మేరకు రాత్రింబవళ్లు తేడాలేకుండా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూనే ఉన్నాయి. కొంచెం అటు ఇటు అయినా సరే.. వచ్చే ఎన్నికల్లోగా అమరావతి రాజధానిలోని కీలక భవనాలన్నీ ఒక నిర్దిష్టమైన రూపు సంతరించుకుంటాయని అనుకోవచ్చు. కార్యకలాపాలు కూడా ప్రారంభం కావొచ్చు. అయితే.. అమరావతి భవనాలు ఒక్కటొక్కటిగా పూర్తి అవుతూ.. ప్రజలకు అందుబాటులోకి రావడానికి శ్రీకారం ఈ విజయదశమి నాడే జరగనుంది. అమరావతికి రాజధాని నగరానికి ఆయువుపట్టు వంటి సీఆర్డీయే భవనం విజయదశమికి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయిన ఈ భవనాన్ని విజయదశమికి ప్రారంభించాలని  ప్రభుత్వం సంకల్పిస్తోంది.

అమరావతి అంటేనే సీఆర్డీయే అనే సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అమరావతికి ఆయువుపట్టు వంటి సీఆర్డీయే దాదాపు నాలుగున్న ఎకరాల్లో విస్తరించిన పరిపాలన భవనం నిర్మాణం గతంలో తెలుగుదేశం పాలన కాలంలోనే ప్రారంభం అయింది. అమరావతి రాజధాని నిర్మాణాలకు, నగర రూపకల్పనకు సంబంధించి.. అత్యంత కీలకమైన నిర్ణయాక వ్యవస్థ సీఆర్డీయే కావడంతో.. ముందు దీనినే ప్రారంభించారు. అప్పటి తెలుగుదేశం పాలనలోనే చాలావరకు భవన నిర్మాణం కూడా పూర్తయింది. అయితే.. జగన్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మీద పగబట్టి… స్మశానంలాగా మార్చేసిన క్రమంలో భాగంగా.. సీఆర్డీయే భవననిర్మాణ పనులను కూడా ఎక్కడివక్కడ ఆపేశారు.

తిరిగి ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ పనులు జోరందుకున్నాయి. మొత్తం 2.42 లక్షల చదరపు అడుగుల వైశాల్యం అందుబాటులో ఉండేలా ఈ భవనాన్ని పూర్తిచేస్తున్నారు. ప్రతి అంతస్తులోనూ 33 వేల చదరపు అడుగుల కార్యాలయ స్థలం ఉంటుంది. అలాగే సమావేశ మందిరాలు, ఓపెన్ టెర్రేస్ సమావేశ స్థలి వంటివి కూడా ఉంటాయి. రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా అమరావతిలో పెట్టుబడులకు వచ్చే సంస్థల ప్రతినిధులు అందరితోనూ సీఆర్డయే భవనంలోనే సంప్రదింపులు, సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

సీఆర్డీయే భవనాన్ని అమరావతికి ఒక తలమానికంలాగా నిర్మించడం ద్వారా.. పెట్టుబడులతో వచ్చేవారిని మరింతగా ఆకర్షించగలమనే విశ్వాసంతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్ తదితర అనేక అత్యాధునిక ఏర్పాట్లు చేశారు. మొత్తానికి అమరావతిలో ప్రభుత్వం పరంగా తొలి భవనంగా .. సీఆర్డీయే కార్యాలయం అందుబాటులోకి రానుండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles