చంద్రబాబు నాయుడు సంకల్పబలానికి నిదర్శనంగా రూపుదిద్దుకుంటున్న నగరం అమరావతి. అచ్చమైన ప్రజారాజధాని అనే నిర్వచనానికి సరితూగే నగరం ఇది. ప్రజలే స్వచ్ఛందంగా లాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన స్థలాల్లో రాజధాని నిర్మాణం కావడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు అదొక్కటే కాదు.. మరొక్కర కారణం వల్ల కూడా అమరావతిని ప్రజారాజధాని అనడానికి నూరుశాతం సహేతుకత ఉందని అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే.. అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రజలు కూడా భాగం పంచుకోనున్నారు. ప్రజల విరాళాలు కూడా ఇందుకోసం సేకరించడానికి ప్రభుత్వం పూనుకుంది.
అమరావతి రాజధాని అనే అంశంతో.. రాష్ట్ర ప్రజలు మమేకం అయ్యారు. తాము గర్వించే రాజధాని వస్తుందనే ఆశ.. అటు శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు రాష్ట్రప్రజలందరిలోనూ సమానంగా ఉంది. ఆ రాజధానికి ద్రోహం చేయడం వల్ల మాత్రమే.. జగన్మోహన్ రెడ్డిని అత్యంత నీచంగా ఓడించి బుద్ధి చెప్పారు కూడా. అలాంటి ప్రజలు నిర్మాణంలో భాగం పంచుకోకుండా ఎందుకుంటారు? అమరావతిలో నిర్మాణాలకోసం ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ప్రజల ఆశలను అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం చేయడంలో చంద్రబాబునాయుడు సంకల్పం కొత్త పుంతలు తొక్కుతోంది. సీఆర్డీయే వెబ్ సైట్ లో అమరావతి కోసం విరాళాలు ఇవ్వదలచుకున్న వారికోసం ఒక క్యూఆర్ కోడ్ ను కూడా అందుబాటులో ఉంచారు. ప్రజలు ఎవ్వరైనా విరాళం ఇవ్వదలచుకుంటే.. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఇవ్వవచ్చు. ఇది ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత.. విరాళాలు ఘనంగానే అందుతాయని అతా అనుకుటున్నారు.
గతంలో 2019కి పూర్వం అమరావతి కోసం ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు కూడా చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేశారు. ప్రజలను అమరావతి కోసం తలా ఒక ఇటుక స్పాన్సర్ చేయమని అడిగారు. ఒక ఇటుక పది రూపాయలు వంతున విరాళం ఇవ్వడం అన్నట్టుగా రూపొందించారు. ఇప్పుడు సీఆర్డీయే ద్వారా.. క్యూఆర్ కోడ్ ఇచ్చి విరాళాలు స్వీకరిస్తున్నారు.
ప్రజల విరాళాల ద్వారా.. కనీసం అమరావతిలోని ఒకటి రెండు ప్రభుత్వ నిర్మాణాలకైనా అవసరమైన నిధులు సమకూరితే.. అది కూడా ఓ అద్భుతం అవుతుందని అంతా అనుకుంటున్నారు. దేవాలయాలకు విరాళాలు ఇచ్చినట్టుగా.. దేవతల రాజధానిగా సంకల్పిస్తున్న అమరావతి నిర్మాణానికి కూడా ప్రజలు విరాళాలకు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే పీ4 రూపంలో సంపన్నులు.. ప్రజోపయోగ సేవా కార్యక్రమాలకు చేయూత అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పీ4 రూపంలో విరాళాలు ఇస్తున్న సంపన్నుల్లోనే కొందరు.. అమరావతి రాజధాని కోసం కూడా భారీ విరాళాలు అందించే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు.
