అమరావతి లోనే రాజధాని కొనసాగాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాజధాని వికేంద్రీకరణ అనే మాటలు చెబుతున్నప్పటికీ అది తమ పరిధిలో లేని అంశం అని ప్రభుత్వం గ్రహించింది. విశాఖలో కొండలను శిథిలం చేసి భవంతులు కట్టుకున్నప్పటికీ, అక్కడికి రాజధాని తీసుకువెళ్లడం అంత సులభం కాదని కూడా పాలకులకు తెలుసు. అందుకే అమరావతి అనే నగరం పట్ల అసూయతో ద్వేషంతో రగిలిపోతున్నారు. అమరావతి అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లలో మార్పుల పేరుతో అమరావతి స్వరూపాన్ని సర్వనాశనం చేయడానికి, తమ విధ్వంసరచనను అక్కడ కూడా కొనసాగించడానికి కుట్ర జరుగుతున్నట్లుగా ప్రజలు భయపడుతున్నారు. అమరావతి ప్రాంతంలో ప్రత్యేకంగా ఐటి పరిశ్రమ కోసం కేటాయించిన 600 ఎకరాల స్థలం విషయంలో ప్రభుత్వానికి రైతుల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది.
జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏర్పాటైన తర్వాత రాష్ట్రానికి ఒక కొత్త ఐటి పరిశ్రమ అయినా రాలేదు సరి కదా.. ఉన్నవి కూడా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయనే వాదన ప్రజల్లో చాలా బలంగా ఉంది. విశాఖలో ఐటీ పరిశ్రమలకు కేంద్రంగా అనేక కార్యాలయాలు ఏర్పాటు అయితే.. రాజధానికి అవసరం అంటూ వాటన్నింటినీ కొన్నేళ్ల కిందటే ఖాళీ చేయించారు. ఆ పరిశ్రమలు అసలు రాష్ట్రాన్నే వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయి.
అమరావతి ప్రాంతంలో కూడా ఐటీ పరిశ్రమ వర్ధిల్లడానికి నిడమర్రు గ్రామ సమీపంలో ఐటీ జోన్ కోసం 600 ఎకరాలను గతంలో మాస్టర్ ప్లాన్ లో కేటాయించారు. ఈ స్థలాన్ని ఐటి హబ్ కోసమే రిజర్వ్ చేశారు. అయితే జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తరహా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని చూసి ఓర్వలేక నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఇదే స్థలాన్ని ప్రతిపాదించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని ఎవ్వరూ కాదనరు. కానీ ఐటి హబ్ కోసం రిజర్వ్ చేసిన స్థలాన్ని కేటాయించడం మాత్రం కుట్రగా అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు.
ఇక్కడ ఐటి హబ్ ను మాత్రమే కొనసాగించాలని మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయకూడదని రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సిఆర్డిఏ కమిషనర్కు తమ అభ్యంతరాలను తెలియజేయడం తాజా పరిణామం! అసలు అభ్యంతరాలను స్వీకరించడానికి సి ఆర్ డి ఏ గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయకుండా తమ కార్యాలయానికి రైతులను రమ్మని చెప్పడమే దారుణం అంటూ వారు వాదిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ లో మార్పుల పేరిట అమరావతికి రూపుదిద్దిన ఒక అందమైన స్వరూపాన్ని సర్వనాశనం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లుగా ప్రజలు భయపడుతున్నారు. అలాంటి కుట్ర ప్రయత్నాలను ఆపడానికి తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.