అయిదుగురూ పరార్ : ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా వేట!

Wednesday, January 22, 2025

అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించిన, దాడులకు తెగబడిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పరారీలో ఉన్నారు. విచ్చలవిడిగా విధ్వంసం సృష్టించినా సరే.. కోర్టులనుంచి ముందుగానే బెయిల్ ఉత్తర్వులు తెచ్చుకుని యథేచ్ఛగా తిరుగుతూ ఉండవచ్చుననుకునే దురహంకారానికి హైకోర్టు చెక్ పెట్టింది. జగన్ హయాంలో చంద్రబాబునాయుడు ఇల్లు, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడులు చేసిన, తమ అనుచర మూకలను ఉసిగొల్పిన వైసీపీ నాయకులకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది. దీంతో ఆరోజున రెచ్చిపోయిన వారంతా ఇప్పుడు హఠాత్తుగా అదృశ్యం అయ్యారు. అయిదుగురు కీలక నాయకులు పరారయ్యారు. పోలీసులు వీరికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, పొరుగు రాష్ట్రాలైన చెన్నై, బెంగుళూరుల్లోనూ గాలించే ప్రయత్నంలో ఉన్నారు.

వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో వందలాది మంది రౌడీ మూకలు తెలుగుదేశం ఆఫీసు మీద దాడిచేసి విధ్వంసం సృష్టించారు. అప్పటి ఎంపీ నందిగం సురేష్, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి ఈదాడులకు నేతృత్వం వహించారు. దగ్గరుండి దాడులు చేయిస్తూ.. మూకలను రెచ్చగొట్టారు. అలాగే చంద్రబాబునాయుడు ఇంటిమీదకు మాజీ మంత్రి జోగి రమేష్ తన మూకలను ఉసిగొల్పారు. ఈ కేసులు అప్పట్లోనే నమోదైనా సహజంగానే జగన్ సర్కారు వాటిని పట్టించుకోలేదు. తెలుగుదేశం గద్దె ఎక్కిన తర్వాత.. కేసుల విచారణ ప్రారంభం అయింది. ఇప్పటికే పలువురిని అరెస్టులు కూడా చేశారు. విచారణ ద్వారా.. ఈ కీలక నాయకుల పాత్రను కూడా పోలీసులు నిర్ధరించుకున్నారు. విచారణ నిమిత్తం వీరికి నోటీసులు సర్వ్ చేసేసరికి అంతా హైకోర్టుకు ముందస్తు బెయిలుకోసం వెళ్లారు. సుదీర్ఘంగా వాదప్రతివాదాలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు బెయిలు తిరస్కరించింది.

ఈ అరాచక నాయకులకు అంతకంటె పెద్ద షాక్ ఏంటంటే.. సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకునే వరకు పోలీసులు తమను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరినప్పటికీ కూడా హైకోర్టు వారి వినతిని మన్నించలేదు. కోర్టు వారి వినతిని తిరస్కరించిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఈలోగానే నాయకులు అయిదుగురూ పరారైనట్టుగా, అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసులను చాలా సీరియస్ గా తీసుకుంటోంది. వారికోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇంటికి పోలీసులు వెళ్లగా ఆయన అప్పటికే ఇంటినుంచి పారిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles