తన అక్కసు వెళ్లగక్కడానికి ‘చంద్రబాబు నాయుడుకు ఇవి చివరి ఎన్నికలు’ అని, ఆయన ఇక్కడి నుంచి డైరెక్ట్ గా నరకానికి వెళ్తారని.. లేకి మాటలు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు యొక్క చావు కోరుకుంటున్నారు! అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులలోని భయం మరో రకంగా ఉంది! జగన్మోహన్ రెడ్డి చావు గురించి వారు ఎవరు ప్రస్తావించుకోవడం లేదు గానీ, ఉన్నపళంగా ఇప్పుడు జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తే, కేసులు అన్ని పకడ్బందీగా మారుతున్న తరుణంలో సుదీర్ఘకాలం జైలులోనే ఉండవలసి వస్తే పరిస్థితి ఏమిటి? పార్టీని నడిపేది ఎవరు? అసలు ఈ పార్టీ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనగలుగుతుందా? అనే సందేహాలు పార్టీ వర్గాలలో కలుగుతున్నాయి.
అదే సమయంలో వారందరిలో ఒక భయం కూడా వ్యక్తం అవుతోంది. అదేంటంటే జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తే పార్టీ సర్వాధికారాలను సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల్లో పెట్టి వెళ్తారా అనేదే వారి భయం! జగన్ పరోక్షంలో సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ తానే అయినట్లుగా పతాక వందనం చేయడం పార్టీ కార్యకర్తలకు అలాంటి అనుమానాలను కలిగిస్తోంది.
79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఎక్కడా పాల్గొనలేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ఎదుట కనిపించే రెండు మూడు కార్యక్రమాలు పూర్తయ్యాయి కాబట్టి ఆయన బెంగుళూరు ప్యాలెస్ కు వెళ్ళిపోయారు. కనీసం అక్కడైనా సరే తన ప్యాలెస్ ఆవరణలో జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆ ఫోటోను వీడియోలను సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ జగన్ పతాకావిష్కరణకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దూరంగా ఉండిపోయారు.తాడేపల్లి పాలెస్ లో జగన్ పాత్రను సజ్జల పోషించారు.
జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించిన రోజులలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల మంత్రిగా, డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా అన్ని అధికారాలను చలాయించారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి మీడియాతో మాట్లాడాలంటే భయం, అందుకే తరచుగా ప్రెస్ మీట్లకు ఇంటర్వ్యూలకు ప్రభుత్వం తరఫున నేను వస్తుంటాను అని స్పష్టం చేశారు సజ్జల! ఇప్పుడు జగన్ పరోక్షంలో ఇక పార్టీ మొత్తం తనదే అనే సంకేతాలు ఇస్తున్నట్లుగా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పతాకావిష్కరణ కూడా సజ్జల చేతుల మీదుగానే జరిగింది.
జగన్ ప్రస్తుతం బెయిలు మీద ఉన్న కేసులు కూడా త్వరలోనే కొలిక్కి వస్తాయనే ప్రచారం ఒక వైపు ఉంది. అదే సమయంలో.. మూడున్నర వేల కోట్లు కాజేసిన లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర నిర్ధరణ అయి ఆయన అరెస్టు అయ్యే సందర్భం ఎంతో దూరంలో లేదని కూడా ప్రజలు అనుకుంటున్నారు. లిక్కర్ కేసులో బుక్ అయితే.. పాత క్విడ్ ప్రోకో కేసుల్లాగా బెయిలు కూడా అంత ఈజీ కాదని.. జైల్లో మగ్గాల్సి వస్తుందని, శిక్షలు ఖరారు అవుతాయని, దానికి తగినంత పకడ్బందీగా సిట్ ఆధారాలన్నీ సేకరిస్తున్నదని కూడా గుసగుసలున్నాయి.
మరి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళితే పార్టీకి దిక్కెవ్వరు? గతంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు.. జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకుంటూ తన భుజాన బాధ్యత వేసుకుని రాజకీయం చేసిన షర్మిల ఇప్పుడు శత్రువుగా మారారు. వైఎస్ భారతి క్రియాశీలంగా తెరపైకి వచ్చే అవకాశం లేదు. ఇలాంటి నేపథ్యంలో పార్టీ బాధ్యత మొత్తం సజ్జల చేతికే వెళుతుందా? నెంబర్ టూ అని చెప్పుకునే సజ్జల.. జగన్ జైలుకు వెళ్లాక మొత్తం సారథ్యం తీసుకుంటారా? అనే చర్చ పార్టీలో నడుస్తోంది. మొన్నటి ఎన్నికల దెబ్బకే పార్టీని వీడి వెళ్లిపోయిన పలువురు సీనియర్ నాయకులు.. కేవలం సజ్జల వల్లనే తామంతా వెళ్లిపోయినట్టు ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. సజ్జల పూర్తి స్థాయి నాయకత్వం వహిస్తే పార్టీకి అధోగతే అని పలువురు భయపడుతున్నారు.
