పిలిచి పిల్లనిస్తానంటే కులం అడిగాడని సామెత! ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు అదేవిధంగా ఉంది. శాసనసభలో మామూలు ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డికి లేని ప్రాధాన్యతను కట్టబెట్టి, అర్హత లేని విలువను అందించినందుకు ఆయన ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ‘మీరు ఇచ్చిన గౌరవం నాకు చాలదు.. నేను కోరుకునేంత పెద్ద గౌరవం కావాలి’ అంటూ బీరాలు పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వాలకం గమనిస్తే శాసనసభ సమావేశాలకు రాబోయే ఐదేళ్లపాటు కూడా హాజరు కాకుండా ఎగ్గొట్టడానికి మాత్రమే ఆయన ఎత్తుగడలు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, తనను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు రాసిన లేఖ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఏపీ రాష్ట్ర ప్రజలు జగన్ ను హాస్యాస్పదంగా చూస్తున్నారు.
జగన్ మామూలు ఎమ్మెల్యే అయినప్పటికీ- మంత్రులందరి ప్రమాణం తర్వాత, మహిళా సభ్యుల ప్రమాణం తర్వాత, పురుష సభ్యుల లు ప్రమాణం చేసేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆయన పేరు ఎక్కడ వస్తే అక్కడ మాత్రమే పిలవాల్సి ఉన్నప్పటికీ.. రూల్స్ అన్నింటినీ పక్కన పెట్టమన్న చంద్రబాబు నాయుడు పురమాయింపు మేరకు.. ఆయనకు లేని గౌరవాన్ని కట్టబెట్టింది శాసనసభ. మంత్రుల ప్రమాణం పూర్తయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడి లాగా ఆయన పేరు పిలిచి ప్రమాణం చేయించారు. ఆ మర్యాదను నిలబెట్టుకోకుండా ప్రమాణం తర్వాత సభలో క్షణమైనా ఉండకుండా ఇంటికి పారిపోయారు జగన్మోహన్ రెడ్డి. స్పీకరును శాసనసభాపక్షాలన్నీ కలిసి సభాపతి స్థానం వద్దకు తీసుకువెళ్లాలనే సభా మర్యాదను, గౌరవాన్ని, సాంప్రదాయాన్ని కూడా పాటించకుండా తన సంకుచిత బుద్ధిని చాటుకున్నారు ఆయన!
అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు. ‘సభలో అధికారపక్షం తర్వాత- ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఉంటే అదే ప్రధాన ప్రతిపక్షం అవుతుంది’ ఇదే సాంప్రదాయం అని జగన్ నొక్కి వక్కాణిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం అనే హోదా దక్కాలంటే 10 శాతం సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదని ఆయన తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. 2019 తర్వాత తెలుగుదేశం నుంచి ఐదుగురు సభ్యులను ఫిరాయింపచేస్తే చంద్రబాబు నాయుడుకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలనని అప్పట్లో చేసిన ప్రతిజ్ఞలను ఆయన విస్మరిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు రాసిన లేఖ రూపంలో ప్రదర్శిస్తున్న నాటకాల పరమార్ధం రాబోయే ఐదేళ్లపాటు శాసనసభకు రాకుండా ఎగ్గొట్టడం మాత్రమే అని ప్రజల్లో అంచనాలు సాగుతున్నాయి. తెలుగుదేశం వారిని అధికారంలో ఉండగా చూసి ఓర్వలేక, ఇన్నాళ్లు వారిని వేధించిన దానికి తనకు జరిగిన శాస్తి క్షణక్షణం గుర్తుకొస్తూ ఉంటే, ఆ సభలో కూర్చోవడానికి మొహం చెల్లక జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా పలాయనం చిత్తగించడానికి తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని నిబంధనలకు విరుద్ధమైన డిమాండుతో స్పీకరును ఆశ్రయించినట్టుగా కనిపిస్తోందని ప్రజలు అంటున్నారు.
సభకు ఎగ్గొట్టడానికి చవకబారు ఎత్తుగడ!
Friday, November 22, 2024