‘సూపర్ సిక్సో సూపర్ సెవెనో.. అవేమీ కనపడ్డం లే’ అంటూ వెటకారపు డైలాగులు వల్లిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ర రెడ్డి దాదాపుగా ప్రతి సందర్భంలోనూ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి సాహసిస్తూ ఉంటారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతోంది? ఏయే హామీలు కార్యరూపంలోకి వచ్చేస్తున్నాయి అనేది గమనించకుండా.. కనీసం మాట మీద నియంత్రణ పాటించకుండా.. ఓడిపోయిన తొలినాటినుంచి ఇవాళ్టిదాకా ఒకే తరహా పాచిపోయిన విమర్శలతో బతికేస్తూ ఉన్నారు ఆయన. ఆయన ఇంకా ఆ బాటలో ఉండగానే.. తమ మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటినీ ఒక్కటొక్కటిగా కార్యరూపంలో పెట్టేస్తూ ప్రజల మనసులను గెలుచుకోవడంలో చంద్రబాబు సర్కారు అడుగులు ముందుకు వేస్తోంది.
సూపర్ సిక్స్ హామీలలో ఒక కీలక హామీ అయినటువంటి ‘అన్నదాతా సుఖీభవ’ పథకం అమలుకు తాజాగా ముహూర్తం నిర్ణయించారు. ఒంగోలులో ఆగస్టు 2వ తేదీన జరిగే కార్యక్రమంలో చంద్రబాబునాయుడు తొలివిడత నిధులను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు.
చంద్రబాబునాయుడు పేదలను లక్ష్యించి.. వారి జీవితాల్లో వికాసం కోసం సూపర్ సిక్స్ హామీలను ఇచ్చారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా.. అయిదేళ్ల పాటు పాలన సాగించడానికి అధికారంలోకి వచ్చినప్పుడు.. వచ్చిన వెంటనే తాము చెప్పిన సకలహామీలను అమలు చేసేయడం అనేది సాధ్యం కాని పని.
పైగా రాష్టాన్ని అయిదేళ్ల పాటూ విధ్వంసం దిశగా నడిపించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన తర్వాత.. ఆర్థికంగా కుదురుకోవడానికే కొన్ని ఏళ్లు పట్టే పరిస్థితి. ఈ నేపథ్యంలో.. చంద్రబాబునాయుడు ఒకవైపు పరిస్థితులను చక్కదిద్దుకుంటూనే హామీలను ఒకటొకటిగా అమలు చేయడానికి పూనుకుంటున్నారు.
అయితే జగన్ దళాలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా.. హామీలు అమలు కావడం లేదని.. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని రకరకాల పేర్లతో ఏడాది కూడా తిరక్కముందే తమ బూటకపు పోరాటాలను ప్రారంభించి అభాసు పాలవుతున్నారు. ఇలాంటి సమయంలో సూపర్ సిక్స్ లో కీలకమైన అన్నదాతా సుఖీభవ హామీని ఆగస్టు 2 నుంచి అమలు చేయబోతున్నారు.
ఈ పథకం కింద రైతులకు 20వేల రూపాయలు ఇస్తాం అని కూటమి హామీ ఇచ్చింది. కేంద్రం ఇచ్చే 6 వేల రూపాయలకుతోడు 14 వేలు రాష్ట్రప్రభుత్వం సమకూర్చి ఇవ్వనున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ నిధులను ప్రతి రైతు ఖాతాకు మూడు విడతల్లో చెల్లించబోతున్నట్టుగా హామీ ఇచ్చారు తొలి విడత చెల్లింపులు ఆగస్టు 2న జరగనున్నాయి.
ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ దళాలకు క్లిష్ట పరిస్థితి ఎదురవుతోంది. ఈ రకంగా కూటమి ప్రభుత్వ హామీలన్నీ అమలు అయిపోతోంటే.. తమ పార్టీ మనుగడ ఎలాగ? అనేది వారి భయం. రైతుల మేలు కోసం విడతలు విడతలుగా వారికి వ్యవసాయానికి సాయం అందివ్వడానికి ప్రభుత్వం ఈ చెల్లింపులు చేస్తుండగా.. అందులో లోపాలు వెతకడానికి జగన్ దళాలు కుట్రలు చేస్తున్నాయి. మూడు విడతల్లో ఇస్తానని ముందు చెప్పలేదని అదికూడా ఒక తప్పులాగా ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం మీద బురద చల్లాలనే కోరిక తప్ప.. రైతుకు సాయం విడతలుగా ఇస్తేనే వ్యవసాయానికి ఉపయోగపడుతుంది అనే వాస్తవాన్ని వారు మర్చిపోతున్నారు. అయితే వీరి విషప్రచారాలను ఏమాత్రం పట్టించుకోకుండా.. కూటమి సర్కారు పనిచేసుకుంటూ పోతుండడం విశేషం.
