ఆధునిక సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ.. దానివలన సమాజానికి ఎంత మేలు జరుగుతున్నదో.. అంత చేటు కూడా జరుగుతున్నదని ఒప్పుకోవాల్సిందే. సాంకేతిక విప్లవాన్ని సమాజ పురోగతికి ఎంతగా వాడుతున్నప్పటికీ దానిని అడ్డుపెట్టుకుని దుర్మార్గాలు చేస్తున్నవారు కూడా పెరుగుతున్నారు. సోషల్ మీడియా వికృత రూపాలు కూడా ఇందుకు పెద్ద ఉదాహరణ. ఎందుకంటే, సోషల్ మీడియా ద్వారా ప్రతి పౌరుడు కూడా తన నిశ్చితమైన అభిప్రాయాన్ని సమకాలీన వ్యవహారాలపై వెల్లడించడానికి అధికారం ఉంటుంది.
అదే సమయంలో సోషల్ మీడియాను వాడుకుని.. రాజకీయ కుటిలత్వం ప్రదర్శించడానికి, తమకు కిట్టనివారిని కేరక్టర్ అసాసినేషన్ చేస్తూ దుర్మార్గాలకు పాల్పడేవారు కూడా ఉన్నారు. సాంకేతిక విప్లవం నేపథ్యంలో టెక్ అవగాహనతో నిమిత్తం లేకుండా సమాజంలో ప్రతి వ్యక్తి వద్ద స్మార్ట్ ఫోనులు ఉంటున్న ఈరోజుల్లో.. ఆఫోన్ల ద్వారా జరిగే మోసాలు కూడా ఎక్కువయ్యాయి. ఆన్లైన్ మోసాలు, లోన్ యాప్ మోసాలు, బెట్టింగ్ మోసాలు.. లెక్కరాసుకుంటూ పోతే కొండవీటి చేంతాడంత అవుతాయి. ఇలాంటి బెట్టింగ్ యాప్ లు, సైబర్ నేరాలను నియంత్రించడానికి ఎన్డీయే కూటమి సర్కారు కొత్త చట్టం తేవడానికి కసరత్తు చేస్తోంది.
ఇందుకోసం శాసనసభ్యులనుంచి ఒక పిటిషన్ల కమిటీని ఏర్పాటుచేశారు. డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణరాజు ఈ పిటిషన్ల కమిటీకి అధ్యక్షులు. ఈ కమిటీ సమావేశం తాజాగా అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. రఘురామ మాట్లాడుతూ.. సైబర్ నేరాలను పూర్తిగా కట్టడి చేయడానికి కూటమి ప్రభుత్వం కొత్త చట్టం తేనున్నదని.. ఈ చట్టానికి సంబంధించిన విధివిధానాలపై కమిటీ కసరత్తు చేస్తున్నదని చెప్పారు.
నిజానికి ఇవాళ్టి రోజుల్లో సైబర్ నేరాలు చాలా పెరిగిపోయాయి. అమాయకులను బుట్టలో వేసుకుని.. లక్షలు కోట్లు కొల్లగొట్టేయడం నిత్యకృత్యంగా మారింది. ఇలాంటి సైబర్ నేరాలకు బలయ్యేవారు 1930 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోను చేసి తక్షణ సమాచారం ఇవ్వాలని రఘురామ అంటున్నారు. అలాగే.. బెట్టింగ్ యాప్ లు వంటి వాటిని పూర్తిగా కట్టడి చేసేలా చట్టాలు తేనున్నట్టు చెబుతున్నారు.
గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో కూడా సైబర్ పరంగా కొన్ని కొత్త చట్టాలు వచ్చాయి. అయితే అవేవీ సమాజ హితాన్ని కాంక్షించేవి కాదు. అచ్చంగా ప్రభుత్వం మీద ఎవరైనా పల్లెత్తు మాట అంటే.. వారిని జైళ్లకు పంపడానికి ఉద్దేశించినవి. జగన్ అలాంటి చట్టాలు తెచ్చారే తప్ప.. ప్రజలకోసం ఆలోచించలేదు. కానీ.. సైబర్ నేరాల బారిన సామాన్యులు కూడా బలవడం ఇటీవలి కాలంలో పెరిగింది. ఈ యాప్ లు, వ్యవహారాలు ప్రజలను ఆత్మహత్యలకు పురిగొల్పడమూ జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో వీటి కట్టడికి కొత్త చట్టం వస్తే సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని అంతా అంటున్నారు.ఆధునిక తరానికి తగ్గట్టుగా.. సమాజహితాన్ని కాంక్షించే చట్టం అవుతుందని నిపుణులు కితాబిస్తున్నారు.
