వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల్లో ఒకడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన తమ్ముళ్లలో ఒకడు అయిన అనంతబాబు.. తన డ్రైవరు అయిన దళితయువకుడిని హత్య చేసి, అతడి ఇంటి వద్దకు తానే స్వయంగా డోర్ డెలివరీ చేసిన సంఘటన అప్పట్లో ఎంత పెద్ద సంచలనం అయిందో అందరికీ తెలుసు. ఈకేసులో నిందితుడు అయిన అనంత బాబు అప్పట్లో అరెస్టు అయ్యారు కూడా. రిమాండులో కొంత కాలం ఉండి బెయిలుపై విడుదల అయ్యారు. ఆ తర్వాత కేసు విచారణ నీరుగారిపోయింది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. దళిత యువకుడి దారుణ హత్య ను సీరియస్ గా తీసుకుంది. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున పరిహారం అందజేయడంతో పాటు, వారికి న్యాయసలహాలకు ప్రత్యేక న్యాయవాదిగా ముప్పాళ్ల సుబ్బారావును కూడా నియమించారు. కేసు విచారణ ముందుకు సాగింది. మొత్తానికి ఈ హత్యకేసు విచారణను తిరిగి కొనసాగించాలా లేదా అనే విషయంలో ఎస్సీ ఎస్టీ కోర్టు ఈ నెల 22న తీర్పు వెలువరించనుంది.
వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన అనంతబాబు అప్పట్లో ఎమ్మెల్సీగా ఉండేవారు. 2022 మే 19వ తేదీన తన డ్రైవరు అయిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసి, వారి ఇంటికే అర్ధరాత్రి డోర్ డెలివరీ చేశాడు. అప్పట్లో రాష్ట్రం మొత్తం ఈ ఉదంతం అట్టుడికిపోయింది. హత్య తానే చేసినట్టుగా అనంత బాబు అంగీకరించారని కూడా అప్పట్లో మీడియా సమావేశంలో ఎస్పీ రవీంద్రనాధ్ బాబు వెల్లడించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. తర్వాత మధ్యంతర బెయిలు రావడంతో బయటకు వచ్చారు. ఆయన జైలునుంచి బెయిలుపై బయటకు రావడాన్ని ఒక పెద్ద వేడుకలాగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు జరుపుకున్నారు.
నిజానికి వైఎస్ జగన్ బెయిలుపై బయటకు వచ్చినప్పుడు కూడా.. ఇంత ఆర్భాటం జరగలేదు. ఆయనను ఊరేగింపుగా తీసుకువెళుతూ.. దారిలో క్రేన్ ల సహాయంతో ఆయనకు గజమాలలు అలంకరిస్తూ నానా బీభత్సం చేశారు. అధికారంలో ఉన్నది జగనే గనుక.. అనంతబాబు చేసిన హత్య వ్యవహారం క్రమంగా మరుగున పడిపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆ దళిత కుటుంబం ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ఈ హత్య కేసును సీబీఐ విచారణకు అప్పగిపంచి.. అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని వారు అభ్యర్థించారు. కూటమి సర్కారు వారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు న్యాయసలహాలు ఇవ్వడానికి ముప్పాళ్ల సుబ్బారావు అనే న్యాయవాదనిని ఏర్పాటుచేసింది.
కేసు వనిచారణను తిరిగి కొనసాగించడం గురించి ఎస్సీ ఎస్టీ కోర్టులో వాదప్రతివాదాలు జరిగాయి. మొత్తానికి ఈ విషయంలో ఈ నెల 22న తీర్పు వెలువడనుంది. అధికారం తమ చేతుల్లోనే ఉన్నది కదాని.. అనంతబాబు హత్యచేసి అప్పట్లో సులువుగా తప్పించుకోగలిగారు గానీ.. ఇప్పుడు కేసు పునర్విచారణకు అనుకూలంగా తీర్పు వస్తే మళ్లీ కటకటాల వెనక్కు వెళ్లాల్సి ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు.
