‘రెంటపాళ్ల యాత్రలో పోలీసు నిబంధనల్ని ఉల్లంఘించారా? అవునా.. నాకేం తెలియదే’, ‘ఆ రోజు వెళ్లే వరకు అసలు రెంటపాళ్ల ఎక్కడో, సత్తెనపల్లి ఎక్కడో కూడా నాకు తెలియదే’, ‘మీరేం అనుమతులు ఇచ్చారో, ఆంక్షలు విధించారో నాకేం తెలియదే’, ‘జగన్ యాత్రకు జనాన్ని పోగేయడమా.. అబ్బే నాకేం తెలియదే’.. మాజీ మంత్రి పోలీసులకు చెప్పిన సమాధానాలు అన్నీ ఈ తరహాలోనే సాగిపోయాయి. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఆయనవెంట కారులో ఉన్న నాయకులందరి మీద కేసు నమోదు చేసిన నేపథ్యంలో.. పలువురు నాయకుల మీద ఇతర సెక్షన్ల కింద కూడా కేసులు న మోదు అయ్యాయి. వాటిపై విచారణకు రావాల్సిందిగా పోలీసులు పేర్ని నానికి నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరైన నాని చెప్పిన సమాధానాలను గమనిస్తే.. రెంటపాళ్ల పర్యటనలో ఎన్ని పాపాలైనా జరిగిఉండొచ్చు. నాకు ఏపాపంతోనూ సంబంధంలేదు.. అని వ్యవహారాన్ని సంపూర్ణంగా జగన్ మీదికే నెట్టేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ప్రత్యేకించి.. జగన్ ఎక్కమంటేనే తాను ఆ కారు ఎక్కానని, తిరిగి అదే కారులో తాడేపల్లి వద్దనే దిగానని అంతే తప్ప తనకు ఏమీ తెలియదని అనడం తమాషా. అంటే పాపమేదైనా ఉంటే జగన్ దే తప్ప.. తనకు సంబంధం లేదని పేర్నినాని చేతులు దులుపుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
జూన్ 18న జగన్ యాత్ర సందర్భంగా పగలంతా ఏర్పడిన ట్రాఫిక్ ఇబ్బందుల గురించి కూడా తనకు తెలియదని, రప్పా రప్పా ప్లకార్డులను చూడనేలేదని, జగన్ యాత్రకు తాను జనసమీకరణ చేయనేలేదని ఇలా పేర్నినాని పోలీసుల విచారణలో సమాధానాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఆయన మరీ ఎంత జాగ్రత్తగా సమాధానాలు చెప్పారంటే.. జగన్ పరామర్శ యాత్రలో డీజేలు, నృత్యాలు తదితర హంగామా ఏదీ కూడా తనకు తెలియదన్నట్టుగానే సెలవిచ్చారు.
పేర్నినాని ఇలాంటి సమాధానాలు చెప్పారంటే.. బహుశా ఆయనతోపాటు ఈ నిబంధనలు ఉల్లంఘించిన అందరూ కూడా పోలీసు విచారణను ఎదుర్కొంటున్నారు. వైసీపీ నాయకుల వ్యవహారం మొత్తం ఒకటే స్క్రిప్టు ప్రకారం ఉంటుంది గనుక.. అందరు నాయకులు కూడా ఇదేమాదిరి సమాధానాలు చెప్తుండవచ్చు. కాకపోతే.. వీరెవ్వరూ కూడా తమకు సంబంధం లేదని చెప్పడం వలన.. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో బాగా లోతుగా ఇరుక్కుంటారనే సంగతి వారి ఊహకు ప్రస్తుతం అందకపోవచ్చు. నిబంధనల ఉల్లంఘన, డీజేలు, రోడ్లమీదనే మద్యం తాగడం, నృత్యాలు ఈ కథలన్నీ తెలియకుండానే యాత్ర చేశానని జగన్ చెప్పుకోవడం అనేది సాధ్యం కాదు. పైగా ఈ వ్యవహారాలు ఒకరిద్దరు నాయకులు దాచిపెట్టే ప్రయత్నం చేసినంత మాత్రాన దాగేవి కాదు. డీజేలకు, డ్యాన్సింగులు కట్టిన వారికి డబ్బులు ఎవరిచ్చారు? అనేది పోలీసులు ఆరా తీసినా కూడా మొత్తం లోగుట్టు బయటకు వస్తుంది. మొత్తానికి పేర్ని నాని సహా నాయకులంతా కలిసి జగన్ నే ఇరికించేలా కనిపిస్తోంది.
పాపం మొత్తం జగన్ పైకి నెట్టేస్తున్న పేర్ని నాని!
Monday, December 8, 2025
