వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సరికొత్త రాద్ధాంతాన్ని భుజానికెత్తుకున్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి అన్యాయం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ మీద తెలుగుదేశం నాయకులు దాడి చేశారని విలపిస్తున్నారు. నిజానికి శిలాఫలకం మీద అంబేద్కర్ పేరు కంటే పెద్దదిగా వేసుకున్న తన పేరును చెరపి వేయడం మాత్రమే అక్కడ జరిగినప్పటికీ.. ద్రోహం అంబేద్కరుకు జరిగినట్టుగా రభస చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పెద్ద సవాలు ఎదురవుతోంది. మొన్నటిదాకా పార్టీలోనే ఉండి ఎన్నికలకు ముందే తెలుగుదేశంలో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సూటిగా ఒక సవాలు విసురుతున్నారు. దానిని స్వీకరించే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకూ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఏం అంటున్నారో తెలుసా? ‘దళితులపై జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ప్రేమ ఉంటే, గౌరవం ఉంటే.. దళితులకు ద్రోహం చేసిన, దళితులను హత్యచేసిన తన పార్టీలోని కీలక నాయకులను పార్టీ నుంచి బహిష్కరించాలని అంటున్నారు. దళితులకు శిరోముండనం చేయించిన కేసులో వైకాపాకు చెందిన సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులుకు కోర్టు శిక్ష కూడా విధించిన సంగతి తెలిసిందే. అలాగే దళితుడైనటువంటి తన డ్రైవరును హత్యచేసి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ప్రస్తుతం బెయిలు మీద బయట ఉన్నారు.
ఈ ఇద్దరినీ ముందు తన పార్టీనుంచి బహిష్కరించిన తర్వాత మాత్రమే.. జగన్ దళిత ప్రేమను ఒలకబోయాలని.. అంబేద్కర్ కు జరిగిన ద్రోహం గురించి మాట్లాడాలని డొక్కా మాణిక్యవరప్రసాద్ అంటున్నారు. అంబేద్కర్ విగ్రహం శిలాఫలకం మీద తన పేరు తొలగించడంపై జగన్ చేస్తున్న హడావుడి చాలా హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేస్తున్నారు.
అంబేద్కర్ ను గౌరవించడం అంటే కేవలం ఆయన బొమ్మ కట్టడమూ, బొమ్మను పూజించడమూ మాత్రమే కాదు.. నిజంగా దళితులకు న్యాయం చేయడం, వారికి గౌరవం కల్పించడం మాత్రమే. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డికి అర్థమైతే దళిత ద్రోహులైన తోట త్రిమూర్తులు, అనంతబాబు వంటి వారిని పార్టీలో ఉండనివ్వరని ప్రజలు అనుకుంటున్నారు.