ఏపీ ఎన్నికలలో పోలింగ్ సరళి పట్ల ఎన్డీయే కూటమి పార్టీల నాయకులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎంతో స్పష్టమైన మెజారిటీతో కూటమి అధికారంలోకి రాబోతున్నదని నాయకులు భావిస్తున్నారు. ఈ మేరకు ఎన్డీయే సారథి ప్రధాని నరేంద్రమోడీకి కూడా.. జనసేనాని పవన్ కల్యాణ్.. ‘ఏపీలో గెలుస్తున్నాం’ అనే శుభవార్తను చేరవేయనున్నారు. రేపు (మంగళవారం) ప్రధానిని పవన్ కల్యాణ్ కలిసే అవకాశం ఉంది. ఆ సమయంలో తమ కూటమి గెలవబోతున్న వార్తను కూడా పవన్ , ప్రధాని చెవిన వేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మంగళవారం నాడు ప్రధాని నరేంద్రమోడీ వారణాశి నియోజకవర్గం నుంచి ఎంపీగా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు వారణాశిలోనే ఎన్డీయే కూటమి పార్టీల సమావేశం కూడా జరుగుతుంది. ఆ సమావేశానికి చంద్రబాబునాయుడు కూడా హాజరు కాబోతున్నారు. అయితే సోమవారం నాడు మంగళగిరిలో తన భార్య అన్నా లెజ్నేవాతో కలిసి ఓటుహక్కును వినియోగించుకున్న పవన్ కల్యాణ్.. ఆ తర్వాత భార్యతో కలిసే వారణాశి కి కూడా వెళ్లారు. వారణాశిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికల ఫలితాల గురించి కూడా ఆయన తన అంచనాలను వెల్లడించారు.
‘ప్రధాని మోదీపై అపార గౌరవంతో ఆయన ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలనే సంకల్పంతో ఆయనకు మద్దతు తెలియజేసేందుకు వారణాశి వచ్చినట్లుగా పవన్ వెల్లడించారు. అదే సమయంలో ఏపీ ఫలితాల గురించి మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీయే కూటమి విజయం సాధించడం తథ్యమని, ఓటర్ల తీర్పు స్పష్టంగా ఇచ్చారని, భారీ మెజార్టీతో ఎన్టీయే కూటమి రాష్ట్రంలో గెలవబోతోందని, ఓటర్లు మార్పు దిశగా స్పష్టమైన తీర్పును ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు.
తాము ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం అనే విశ్వాసంతో .. రాష్ట్రంలోనూ ఎన్టీయే కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగమనానికి తగిన విధంగా పని చేస్తుంది. ప్రజాపాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విజేతగా నిలుపుతాం.. అని పవన్ కల్యాణ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాటలు.. ఏపీలో కూటమి పార్టీల కార్యకర్తల్లో కొత్త ఉత్సహాన్ని నింపుతున్నాయి.