కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన డేటా ప్రొటెక్షన్ బిల్లుకు సంబంధించి జరిగిన చర్చ ద్వారా కొన్ని కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఫోన్ టాపింగ్ సంస్థలను వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున కీలక వ్యక్తులు సంప్రదించారా? వారి డెమోను కూడా వీక్షించారా? ఎందుకోసం ఆ ట్యాపింగ్ సంస్థలను సంప్రదించాల్సి వచ్చింది? అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి. తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో మనకు క్లారిటీ లేదు గాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడిన మాటలే ఇలాంటి కొత్త అనుమానాలకు కారణం.
విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ వాట్సప్, ఫేస్ టైం, టెలిగ్రామ్, సిగ్నల్ ఇలా మొబైల్ లోని ఏ యాప్ ను అయినా సరే ట్యాపింగ్ చేయవచ్చునని, అలా ట్యాపింగ్ చేయడాన్ని తాను స్వయంగా చూశానని వెల్లడించారు. మొబైల్ లోని స్పీకరును కంట్రోల్ చేయడం ద్వారా.. వెనుక వైపు ఉండే కెమెరా ద్వారా కూడా ఫోన్ సంభాషణలను వినవచ్చునని దీనికోసం సర్వీస్ ప్రొవైడర్ లేదా టవర్ ద్వారా అందే సంకేతాలతో సంబంధం లేదని, సాంకేతిక అంశాలను కూడా ఆయన వివరించారు. విదేశాలకు చెందిన కొన్ని కంపెనీలు ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రదర్శిస్తుండగా తాను చూశానని అన్నారు. అయితే వారు ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే అమ్ముతామని చెబుతున్నారని కానీ ప్రభుత్వ శాఖల ముసుగులో ఇతరులు కూడా వాటిని కొనుగోలు చేసి స్వప్రయోజనాల కోసం వాడే ప్రమాదం ఉన్నదని చెప్పారు.
‘‘అకడమిక్ పర్పస్ కోసం నేను వారిని సంప్రదిస్తే అలాంటివి 15 నుంచి 20 సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయని చెప్పారు వాటి విలువ 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఉంటుంది’’ అని ధరల పట్టికను కూడా వివరించారు.
ఇప్పుడు ప్రజలకు కలుగుతున్న సందేహం అదే! ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ సంస్థలను సంప్రదించడానికి ఆ సాఫ్ట్‌వేర్‌లను కొనుగోలు చేయడానికి విజయసాయి రెడ్డికి ఉన్న అకడమిక్ పర్పస్ ఏమిటి? ఏ అవసరం కోసం వారిని ఆయన సంప్రదించారు? ఇంతకూ కొనుగోలు చేశారా లేదా? అనే సందేహం అందరికీ కలుగుతోంది!
తెలుగుదేశం హయాంలో ఇలాంటిది జరిగిందని ఆరోపణలు చేయడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నించారు గాని, ఆయన మాటల వలన వైయస్సార్ కాంగ్రెస్ మీదనే కొత్త అనుమానాలు పుడుతున్నాయి. విజయసాయి రెడ్డి సాధారణ నాయకుడేమీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా! అలాంటి వ్యక్తి ట్యాపింగ్ సాఫ్ట్వేర్ సంస్థలను సంప్రదించి డెమోలను పరిశీలించారంటే, కొనుగోలు కూడా జరిగి ఉంటుందని, పార్టీ దానిని వాడుతూ ఉండవచ్చుననే అనుమానం కూడా పలువురికి కలుగుతోంది. ఎవరి ఫోన్ లోకి అయినా ఈ బగ్‌ను పంపి వారి సంభాషణలు మొత్తం వినవచ్చు అని విజయసాయి చెబుతున్న మాటలను గమనిస్తే రాష్ట్రంలో తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన వారని, లేదా, తమకు అనుమానం ఉన్న ప్రజలందరి వ్యక్తిగత విషయాలపై కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిఘా పెట్టగల అవకాశం ఉన్నదని పలువురు భావిస్తున్నారు. ఈ మాటలకు విజయసాయిరెడ్డి మరింత వివరణ ఇస్తేనే ప్రజలలో అనుమానాలు నివృత్తి అవుతాయి.
ఫోన్ ట్యాపింగ్ సంస్థలను విజయసాయి సంప్రదించారట!?
Sunday, November 17, 2024